Vasavi Group | సిటీబ్యూరో: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ వాసవి గ్రూప్‌పై కొనుగోలుదారులు తిరగబడ్డారు. డబ్బులు మొత్తం చెల్లించిన తర్వాత ప్లాట్లను అప్పగించకపోవడంతో ఆగ్రహానికి లోనయ్యారు. ఆ కంపెనీ చేతిలో ఇరుక్కుపోయిన వందలాది మంది కొనుగోలుదారులు బంజారాహిల్స్‌లోని రోడ్ నం. 12 కార్పొరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు.
కొనుగోలు చేసిన ఫ్లాట్లను అప్పగించకుండా వేధిస్తున్నారంటూ మండిపడ్డారు. శనివారం కొనుగోలుదారులు, కార్యాలయానికి చొచ్చుకుని పోయారు. నివ్వెరపోయిన కంపెనీ నిర్వాహకులు… వారిని లోపలే ఉంచి సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. మరింత ఆగ్రహానికి లోనైన కొనుగోలుదారులు… తమ ఫ్లాట్లను ఎప్పటిలోగా అప్పగిస్తారో తేల్చాలంటూ బైఠాయించారు. దాదాపు రెండున్నర గంటలపాటు సాగిన హైడ్రామాతో.. కస్టమర్ల తిరుగుబాటుతో వాసవి యాజమాన్యం నిర్ఘాంతపోయింది.
హఫీజ్‌పేట్ కేంద్రంగా నిర్మిస్తున్న వాసవి లేక్ సిటీ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టులో 2020లో ఫ్లాట్లను బుక్ చేసుకుని 80 శాతం వరకు డబ్బులు చెల్లించామని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని 2024 నాటికే పూర్తి చేయాల్సి ఉన్నా.. ఇప్పటికీ పనులు చేపడుతూనే ఉన్నారు. ఇప్పటికే ఐదు నెలలు గడువు ముగిసినా.. తమ ఫ్లాట్లను అప్పగించలేదని కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. వాసవి సంస్థపై వస్తున్న ఆరోపణలతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతుండగా.. సగానికిపైగా డబ్బులు చెల్లించిన కొనుగోలుదారులందరూ కార్యాలయాన్ని ముట్టడించారు. ఉప్పల్ కేంద్రంగా నిర్మాణంలో ఉన్న వాసవి మెట్రోపోలిస్ కొనుగోలుదారులు కూడా ఆందోళనలో పాల్గొని.. తమకు అప్పగించాల్సిన ఫ్లాట్ల విషయంలోనూ జాప్యం చేస్తున్నట్లు ఆరోపించారు.
అయితే ఆందోళనకు దిగిన కొనుగోలుదారులను కార్యాలయంలో చర్చలు జరిపి.. శాంతింపజేయడంతో తమకు మరో గడువిచ్చి, ఆ లోగా ప్లాట్లను అందజేస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలిపారు. అయితే కార్యాలయాన్ని చుట్టుముట్టిన నేపథ్యంలో.. వాసవి గ్రూప్ ఈ అంశాన్ని బయటకు రాకుండా విశ్వప్రయత్నాలు చేసింది. కొనుగోలుదారులను లోపలికి అనుమతించి, ప్రధాన ద్వారాలు మూసివేసింది. అయితే భారీగా చేరుకున్న జనాలను చూసి కార్యాలయానికి పోలీసులు, మీడియా ప్రతినిధులపై కొనుగోలుదారులు అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మీడియాతో మాట్లాడేదేమి లేదని, అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ కొంతమంది కస్టమర్లు వాదనకి దిగారు. కాగా, వాసవి గ్రూప్ నిర్మాణాలపై వరుస వివాదాలు నగరంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది.