TGSTRC : టీజీ ఆర్టీసీ ఉద్యోగులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తమ 32 ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన హామీ లభించనందున కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఉదయం మొదటి డ్యూటీ నుంచే బస్సులు డిపోలకే పరిమితం అవుతాయని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో కార్మిక నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
సమ్మె నోటీసు ఇచ్చిన టీజీ ఆర్టీసీ ఉద్యోగులతో చర్చలు జరిపిన ప్రభుత్వం వారి డిమాండ్లకు మాత్రం ఆమోదం తెలపలేదు. సమ్మెకు వెళ్తే ప్రజాగ్రహం చవిచూడాల్సి వస్తుందనే భయంతో హుటాహుటిన ఒక ఉన్నత స్థాయి అధికారుల కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ అది కేవలం ‘కాలయాపన’ చేసే చర్యేనని జేఏసీ నేతలు విమర్శించారు. సమస్యల పరిష్కారానికి కమిటీ 4 వారాల సమయం కోరింది. కానీ, జేఏసీ నాయకులు అంగీకరించలేదు. ప్రభుత్వంతో చర్చలు విఫలమైనందున పక్కా హామీ లభించే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని టీజీ ఆర్టీసీ జేఏసీ నేతలు స్పష్టం చేశారు.
ఏప్రిల్ 22 బుధవారం ఉదయం నుంచి ఆర్టీసీ సమ్మె ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నిలిచిపోనున్నాయి. ఫలితంగా ప్రతిరోజూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే దాదాపు లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్ తో పాటు ప్రధాన నగరాల్లో సామాన్య ప్రజలు, విద్యార్థులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మికులను సమ్మె విరమించాలని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అందుకే అధికారుల కమిటీని నియమించామని ఆయన తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. దాంతో, రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరికొన్ని గంటల్లో సమ్మె ప్రారంభం కానుండటంతో ఏం జరుగుతుందన్నది? అనేది ఉత్కంఠగా మారింది.