హిమాయత్‌నగర్, డిసెంబర్ 10: తన స్నేహితులతో కలిసి తాత ఇంట్లో మనవడు దొంగతనం చేసిన ఘటన నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. మంగళవారం నారాయణగూడ పీఎస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇన్స్పెక్టర్ యు.చంద్రశేఖర్, డీఐ నాగార్జున, డీఎస్సై వెంకటేశ్‌తో కలిసి సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. గాంధీకుటీర్ బస్తీలో నివాసం ఉండే యర్రవెల్లి శ్రీధర్(75) రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. అతడి భార్యకు క్యాన్సర్ వ్యాధి రావడంతో 12 ఏండ్ల కిందట మృతి చెందింది. ఆమెకు సంబంధించిన బంగారం, వెండి ఆభరణాలు కలిపి 14 తులాలతో పాటు రూ.20వేల నగదును ఇంట్లోని బీరువాలో భద్రపరిచాడు. అయితే బాధితుడు శ్రీధర్ మనవడు (మైనర్) తన స్నేహితులను కలిసినప్పుడు మా తాత వద్ద బంగారం, డబ్బులు బాగా ఉన్నాయని చెప్పగా.. వాటిని చోరీ చేద్దామని ఇంటి తాళాలు తీసుకోవాలని చెప్పారు. దీంతో ఆ బాలుడు ఇంటి తాళాలు ఇవ్వాలని పలుమార్లు అడిగినా తాత శ్రీధర్ ఇవ్వలేదు.
ఈ నెల 7వ తేదీన చపాతీలు తెచ్చుకునేందుకు బయటకు వెళ్తున్న క్రమంలో తాను టీవీ చూస్తానని అడగడంతో ఇంటికి తాళం వేయకుండా శ్రీధర్ బయటకు వెళ్లాడు. ఈనెల 8వ తేదీన తన కొడుకు శ్రీనివాస్‌కు డబ్బులు ఇచ్చేందుకు బీరువా తీసి చూడగా అందులో దాచిన బంగారు ఆభరణాలు, నగదు కన్పించలేవు. దీంతో ఆందోళన చెందిన శ్రీధర్ తన మనవడు, అతడి స్నేహితులే చోరీ చేసినట్లు అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బాధితుడు శ్రీధర్ ఫిర్యాదు మేరకు క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శ్రీధర్ మనవడిని పోలీసులు విచారించగా.. బంగారు ఆభరణాలు, నగదు తీసుకెళ్లినట్లు ఒప్పుకున్నాడు. వారి వద్ద నుంచి 13తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితుడు శ్రీధర్ మనవడితోపాటు మరో నలుగురు మైనర్ బాలురను అరెస్ట్ చేసి జువైనల్ హోంకు తరలించినట్లు ఏసీపీ శంకర్ తెలిపారు.