మేడ్చల్ జిల్లాలోని పూడూరు గ్రామాన్ని ఇటీవల మేడ్చల్ మున్సిపాలిటీలో విలీనం చేశారు.ఇన్నాళ్లు ఆ గ్రామంలో ఇల్లు కట్టుకోవాలంటే 1000చదరపు అడుగులకు గరిష్ఠంగా రూ. 2వేలలోపు నిర్మాణ చార్జీలు చెల్లిస్తే.. స్థానిక పంచాయతీ కార్యదర్శి ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇచ్చేవారు. ఇటీవల విడుదలైన విలీన ఆర్డినెన్స్‌తో పూడూరు వాసులు 1000 చదరపు అడుగుల ఇంటికి ఏకంగా రూ.10వేలు స్థానిక మున్సిపాలిటీకి చెల్లించుకోనున్నారు. అదే స్థలంలో నాన్ రెసిడెన్షియల్ నిర్మాణం చేపడితే ఆ చార్జీలు రూ.20వేల నుంచి రూ. 50వేల పైమాటే. ఇదొక పూడూరు గ్రామస్తుల సమస్యనే కాదు… ఔటర్ రింగు రోడ్డు చుట్టూ ఉన్న 13మున్సిపాలిటీల్లో విలీనమయ్యే 51 గ్రామాల జనాలపై ఈ బిల్డింగ్ చార్జీలు భారం పడనున్నది.
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): విలీన గ్రామాల్లో సొంతింటి కల మరింత ప్రియంకానున్నది. జీవితంలో ఒకసారే కట్టుకునేదే అయినా.. అనుమతుల కోసమే అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొన్నది. గోటితో పోయేది గొడ్డలి దాకా వచ్చినట్టు.. గ్రామ పంచాయతీలో 2వేల రూపాయలతో వచ్చే ఇంటి అనుమతులకు ఇప్పుడు 5 నుంచి 10 రెట్లు పెరుగుతున్నది. ఇన్నాళ్లూ ఇంటి కోసం కల కన్న సామాన్యులు.. ఇప్పుడు అనుమతుల కోసం మున్సిపాలిటీ చుట్టూ తిరగలేక ఉన్న రేకుల షెడ్డుతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది.
వంద గజాల జాగలో రేకుల షెడ్డు, పెంకుటిల్లు కట్టుకుని దర్జాగా బతికేసే ఆ పల్లెవాసిపై బిల్డింగ్ అనుమతుల పేరిట భారీ మొత్తంలో భారం పడుతున్నది. మున్సిపాలిటీ పరిధిలో పెరుగనున్న మార్కెట్ వాల్యూతో కొత్తగా సొంతింటిని కొనుగోలు చేయాలనుకునే వారి లెక్కలు కూడా మారిపోతున్నాయి. ఇన్నాళ్లు వేసుకున్న బడ్జెట్ అంచనాలన్నీ తలకిందులు అవుతున్నాయి. హడావుడిగా తీసుకువచ్చిన విలీన ప్రక్రియతో భవన నిర్మాణ, రిజిస్ట్రేషన్ చార్జీలు భారీగా పెరగనున్నాయి. అధికారుల చుట్టూ తిరిగితేగానీ, అనుకున్న సమయానికి అనుమతులిచ్చే ఆన్లైన్ వ్యవస్థను ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ నిర్వీర్యం చేసింది. అనుమతులు దేవుడెరుగు పేదోడి జేబుకు చిల్లు పెట్టే బిల్డింగ్చార్జీల భారాన్ని ఎలా భరించాలనేది పంచాయతీలోని ప్రజలను కలవరపెడుతున్నది.
గ్రామాల్లో బిల్డింగ్ అనుమతులు తీసుకోవాలంటే రూ. 2వేల లోపు ఖర్చుతో పూర్తయ్యే వ్యవహారాన్ని అవే గ్రామాలను మున్సిపాలిటీల్లో కలిపి ఐదింతలు చార్జీలు వసూలు చేయనుంది. గ్రామాల్లో ఉండే ఆర్థిక, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా బిల్డింగ్ చార్జీలును పంచాయతీరాజ్ నిర్ణయించింది. కానీ మున్సిపాలిటీల్లో మాత్రం ఇంటి విస్తీర్ణం బట్టి చార్జీలు వసూలు చేయాలనే నిబంధన ఉన్నది. విలీనం పేరుతో ఊరు నుంచి మున్సిపాలిటీకి వచ్చిన సంబురమే తప్ప… చార్జీల మోత సామాన్యుడికి షరాఘాతంగా మారుతున్నది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో కుదేలైపోతున్న బడుగుజీవుడు ఇకపై ఐదురెట్లు పెరిగిన భవన నిర్మాణాల చార్జీల భారం కూడా మోయాల్సి వస్తున్నది. అదే సమయంలో అనుమతుల ప్రక్రియ మరింత జఠిలం కానున్నది. కార్యాలయాల చుట్టూ తిరిగితేగానీ వ్యవహారాన్ని చక్కబెట్టుకోలేని దుస్థితి వస్తున్నది.
గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడం ద్వారా స్థానికంగా స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నిర్దేశించిన భూముల మార్కెట్ విలువ కూడా మారనున్నది. కొత్తగా మున్సిపాలిటీల్లో మారిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అదనంగా ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేడ్చల్ జిల్లా పరిధిలో బండామాదారం గ్రామ పరిధిలో ఉండే 150 గజాల జాగను రిజిస్టేషన్ చేసుకోవాలంటే మార్కెట్ విలువపై రూ.77వేల స్టాంప్ డ్యూటీ, రూ. 28వేల రిజిస్ట్రేషన్ చార్జీలతో కలిపి మొత్తంగా రూ. 1.06లక్షలు చెల్లించాల్సి వచ్చేది. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోకి మారిన తరువాత అదే 150 గజాల ఇంటికి స్టాంప్ డ్యూటీ రూ. 1.18లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీజులు రూ. 10వేల చొప్పున మొత్తంగా రూ. 1.61లక్షలు చెల్లించాల్సి వస్తుంది. విలీన ప్రక్రియతో రిజిస్ట్రేషన్ చార్జీల్లో ఏకంగా రూ. 60వేల వ్యత్యాసం వచ్చింది.