రూ.3.52 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణం
నాగారంలో అంతర్గత రోడ్లకు కళ
రూ.50 లక్షలతో వైకుంఠధామం అభివృద్ధి
తొలగిన ఇబ్బందులు.. ప్రజల హర్షం..
మేడ్చల్ కలెక్టరేట్, మే 24 : చినుకు పడితే చిత్తడిగా మారే మట్టి రోడ్లు…గుంతలు పడి, ఎత్తు పల్లాలతో కాలినడకకు కూడా కష్టపడాల్సిన దారులు…వాహనదారుల సర్కస్ ఫీట్లు ఇది ఒకప్పుడు నాగారం మున్సిపాలిటీలోని పలువార్డుల్లో ఉన్న అంతర్గత రోడ్ల దుస్థితి. మున్సిపాలిటీకి సమకూరిన ఎల్ఆర్ఎస్ నిధులతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వివిధ వార్డుల్లో రోడ్ల రూపురేఖలు బాగుపడ్డాయి. అసౌకర్యంగా ఉన్న మట్టి రోడ్లు బీటీగా మారాయి. దీంతో ప్రజలు యేండ్ల నుంచి పడిన ఇబ్బందులకు తెరపడింది.
27 కాలనీల్లో బీటీ రోడ్ల నిర్మాణం..
నాగారం మున్సిపాలిటీ పరిధిలోని నాగారం, రాంపల్లి ప్రాంతాల్లో ఉన్న 12 వార్డుల్లో మట్టిరోడ్లను బీటీ రోడ్లుగా మార్చారు. ఇందుకోసం సమకూరిన ఎల్ఆర్ఎస్ నిధుల నుంచి రూ.3.52 కోట్లను వెచ్చించారు. ఆయా వార్డుల్లో ఉన్న 27 కాలనీలకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పించారు. భరత్ నగర్ కాలనీ, రాయల్ ఎన్క్లేవ్, బాలరాజ్ రెడ్డి నగర్, గోపీకృష్ణ కాలనీ, దత్తసాయి కాలనీ, మల్లిఖార్జున్ నగర్, సాయి ధరణి కాలనీ, ఈస్ట్ గాంధీనగర్, ప్రశాంత్ నగర్, శ్రీరామ్ నగర్, ఇందిర ప్రియదర్శిని తదితర కాలనీల్లో రోడ్లను బాగు చేశారు. దీంతో ఎంతో కాలంగా మట్టి రోడ్లతో పడిన ఇబ్బందులకు మోక్షం లభించిందని ఆయా కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా వైకుంఠధామంలో అసౌకర్యాలను తొలగించడానికి రూ.50 లక్షల ఎల్ఆర్ఎస్ నిధులను వెచ్చించారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు సైతం అవే నిధులను వినియోగించారు.
తీరిన రోడ్ల సమస్య..
ప్రభుత్వం అందించిన ఎల్ఆర్ఎస్ నిధులతో మున్సిపాలిటీలో అసౌకర్యంగా ఉన్న రోడ్ల ను బాగు చేశాం. ఏండ్లుగా ప్రజలు పడిన కష్టాలు తీరాయి. బీటీ రోడ్ల నిర్మాణంతో పాటు పార్కులు, ఖాళీగా ఉన్న ప్రజా స్థలాల రక్షణకు ప్రహరీలను నిర్మించాం. రూ.50లక్షలతో నాగారంలో వైకుంఠధామాన్ని అభివృద్ధి చేస్తున్నాం.
–కౌకుంట్ల చంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్, నాగారం
మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత..
రోడ్ల సమస్యకు ప్రథమ ప్రాధాన్యతనిచ్చి, ఎల్ఆర్ఎస్ నిధులను వెచ్చించాం. రూ.3.50 కోట్లతో దాదాపుగా మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో రోడ్లను బాగు చేశాం. వైకుంఠధామంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. పార్కుల్లో పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువుల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించాం.
–వాణిరెడ్డి, కమిషనర్, నాగారం మున్సిపాలిటీ