BRSV : కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి రైతాంగానికి కాళేశ్వరం నీళ్లు ఇవ్వాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్వీ, బీర్ఎస్వీవై నేతలు రక్తదానంతో సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ‘రేవంత్ రెడ్డి ఇదిగో మా రక్తం తీసుకో.. రైతన్నలకు కాళేశ్వరం నీళ్ళు ఇవ్వు’ అంటూ సోమవారం తెలంగాణ భవన్లో రక్తదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు నెమ్మాది శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది రక్తతర్పణం చేస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలేదని గుర్తు చేశారు.
కేసీఆర్ తెలంగాణ ప్రజలకు తాగు సాగు నీరు అందించాలని ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని,
ఒక బ్లాక్‌లో ఒక పిల్లర్ కుంగి రెండున్నర సంవత్సరాలు అయినా దానికి మరమ్మతు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు నెమ్మాది శ్రావణ్ కుమార్ ధ్వజమెత్తారు.రేవంత్ రెడ్డికి ధనదాహం.. భూదాహం తీరిందని, ఇక రక్త దాహం మిగిలిందని మండిపడిన ఆయన.. రాష్ట్రంలో ఎక్కడ భూములు ఉన్నా వాటిని నిషేధిత జాబితాలో పెట్టి తన తమ్ముళ్లకు అనుచరులకు భూములను వేల కోట్ల రూపాయలను కట్టబెడుతున్నాడని ఆయన విమర్శించారు.

నీళ్లు అడిగితే బీఆర్ఎస్ నేతల రక్తం కోరిన రేవంత్.. ఇలాంటి చిల్లర మాటల కోసమేనా తెలంగాణ ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది? అని శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు. ‘బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రక్తదానం చేస్తున్నాం, నీకు ఎంత రక్తం కావాలో తీసుకో. సరిపోకపోతే ఇంకా ఇస్తం. కానీ, రైతన్నలకు మాత్రం నీళ్లు ఇవ్వు రెవంత్ రెడ్డి’ అని నెమ్మాది శ్రావణ్ కుమార్ అభ్యర్థించారు.