మేడ్చల్/దుండిగల్/కేపీహెచ్‌బీకాలనీ: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. సోమవారం గండిమైసమ్మ సమీపంలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంతో పాటు పార్టీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు.
జిల్లాలోని ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా జిల్లాలోని ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నాయకులతో సన్నాహక సమావేశాలు నిర్వహించి భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ అభిమానులు తరలివచ్చేలా ప్రణాళికలను రూపొందించారు. రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, రాష్ట్రనాయకులు తరలివస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను భారీ ఎత్తున చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ తర్వాత కేటీఆర్ ప్రసంగించనున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ప్రారంభోత్సవం అనంతరం బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు తరలివస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 20 వేల పైచిలుకు బీఆర్ఎస్ శ్రేణులు వచ్చే అవకాశం ఉన్నందున వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నారు. వచ్చిన వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలం కేటాయించారు. వచ్చిన అతిధులు అందరికీ కనిపించే విధంగా వేదికను ఏర్పాటు చేశారు.
బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను ఆదివారం ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పరిశీలించారు. కార్యక్రమానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేలా సౌకర్యాలను కల్పించే విధంగా తగిన సూచనలు చేశారు. బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని శంభీపూర్‌రాజు, కేపీ వివేకానంద్ పిలుపు నిచ్చారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గస్థాయి నాయకులు, ముఖ్యనాయకులతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి కూకట్పల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నేతలు భారీగా తరలిరావాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా నూతన కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభిస్తారన్నారు. అనంతరం భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.