మేడ్చల్, నవంబర్ 1: ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికే జై కొట్టనున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం మేడ్చల్ నియోజకవర్గంలోని పోచారం మున్సిపాలిటీలో అన్నోజిగూడలో రాజునాయక్, విక్రమ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో 600 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బోడుప్పల్ రెండో డివిజన్లో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో 100 మంది, గుండ్లపోచంపల్లి..బాసరేగడికి చెందిన 25 మంది కాంగ్రెస్కు చెందిన యువకులు కౌన్సిలర్ రాజకుమారి సుధాకర్ ఆధ్వర్యంలో అలియబాద్లో మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్శితులై స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. సమైక్య పాలనలో కాంగ్రెస్ రాష్ర్టాన్ని సర్వనాశనం చేసిందన్నారు. కరెంట్, నీళ్లు లేక రైతులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి కల్పించిందని విమర్శించారు. బీఆర్ఎస్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం పార్టీలో చేరిన రాజునాయక్ మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ను తరిమికొట్టి, గులాబీ జెండాను ఎగురవేసే వరకు నిద్రబోమన్నారు.