సిటీబ్యూరో, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ కార్యాలయాలను కాంగ్రెస్ పార్టీ తమ ప్రైవేట్ కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుంటుందని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పుట్టా విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు. ప్రైవేట్ భవనాలను తమ సోషల్ మీడియా కార్యాలయాలకు అడ్డాగా మార్చుకుంటూ ప్రజాధనాన్ని హరించేయడమే కాకుండా, బీఆర్ఎస్ అదినాయకులు కేసీఆర్, కేటీఆర్‌పై దుష్ఫ్రచారం చేస్తుందని మండిపడ్డాడు. ఈ మేరకు శుక్రవారం ఆయన హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ సందర్భంగా విష్ణువర్ధన్ మీడియాతో మాట్లాడుతూ ఓఆర్ఆర్ సమీపంలో నానక్‌రామ్‌గూడలో ఉన్న హెచ్‌జీసీఎల్ ప్రభుత్వ కార్యాలయాన్ని కాంగ్రెస్ సోషల్‌మీడియా కార్యాలయంగా మార్చుకుందని చెప్పారు. అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని, అందులో ప్రధానంగా కేసీఆర్, కేటీఆర్‌లపై వ్యక్తిగత దూషణలకు దిగుతూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆరోపించాడు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, కాని నేడు ప్రజాపాలన పేరిట ఆయా ప్రజా కార్యాలయాలను కాంగ్రెస్ పార్టీ తమ సొంత ఆఫీసులుగా మార్చేసిందని మండిపడ్డారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్(హెచ్‌జీసీఎల్) కార్యాలయం నానక్‌రామ్‌గూడలో ఓఆర్ఆర్కు అనుకొని ఉందన్నారు.
కాంగ్రెస్ మైండ్షేర్ అనే సంస్థకు చెందిన ప్రైవేట్ వ్యక్తులు అందులో కూర్చొని సోషల్‌మీడియాను రన్ చేస్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. రెండు వారాల క్రితం న్యూస్ పేపర్లలోను వచ్చిందని, దీనిపై సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలను ప్రైవేట్ వ్యక్తులు ఉపయోగించడం తప్పు, అందులో నుంచి బీఆర్ఎస్ నేతల వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కల్గించే విధంగా సోషల్‌మీడియా క్యాంపెయిన్ చేస్తున్నారని ఆరోపించాడు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి మంచిది కాదు, ప్రజాధనం వృథా అవుతుంటే అధికారులు ఇలాంటి విషయాలను చూస్తూ మౌనంగా ఉండకూడదని, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.