బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఏం జరిగింది..? కాంగ్రెస్ 50 ఏండ్ల పాలనలో ఏం జరిగింది..? అనేది ప్రజలు బేరీజు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. “పరంపోగు భూములు ఎవరికైతే అసైన్మెంట్ ఇచ్చామో.. డెఫినెట్‌గా వారికే పట్టా చేసి హక్కులు కల్పిస్తాం. కాంగ్రెసోళ్లు పచ్చి అబద్దాలు చెప్పటంలో పెద్ద మొనగాళ్లు. వారి మాటలను ఎవరూ నమ్మవద్దు” అని పేర్కొన్నారు. గురువారం నర్సాపూర్ నియోజకవర్గం అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌లకు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరై ప్రసంగించారు. “రాష్ట్ర ఏర్పాటుకు ముందు కరెంటు, నిధులు, నీళ్లు లేవు. రైతులు, చేనేతల ఆత్మహత్యలు, వలసలు పోవుడు, చాలా భయంకరమైన బాధలు. కుటుంబమంతా.. చెట్టుకొకడు, గుట్టకొకడు ఉండేది. ఇవన్నీ గమనించి బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే పేదల సంక్షేమం గురించి చర్యలు తీసుకున్నాం. సంపద పెరుగుతున్న కొద్ది పెన్షన్లు పెంచుకుంటూ పోయాం.
వ్యవసాయ స్థిరీకరణ జరగాలని రైతులను బాగుచేసుకున్నాం. రైతుబంధు దుబారానో.. లాభమో రైతులే తేల్చాలి. 24 గంటల కరెంటు వద్దు.. మూడు గంటల కరెంటు ఇస్తాం.. 10హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి అంటున్నడు.. 10హెచ్‌పీ మోటర్లు ఎవడు కొనియ్యాలి..? వాడి అయ్య కొనియ్యాల్నా.? రైతులకు పైసలు యాడికెల్లి రావాలే.. ఆలోచించాలి. కరెంటు బిల్లు ఏంది..? ఎన్ని అవస్థలు. ఇవాళ రైతు పండించుకున్నంత చేతికి డబ్బులు వస్తున్నయి. ఈ పద్ధతి పోవాలని కాంగ్రెసోళ్లు అంటున్నరు. చాటుగ చెప్పలేరు.. ఏకంగా టీవీ ఇంటర్వ్యూల్లోనే బాజాప్తా చెప్తున్నరు. ధరణి పోర్టల్‌తోనే రైతుల భూములు సేఫ్‌గా ఉన్నయి. మీ బొటనవేలికే అధికారం ఇచ్చినం. ఈ అధికారాన్ని కాపాడుకుంటారా..? కాంగ్రెస్‌కు అప్పజెప్పి పొడగొట్టుకుంటారా.? ఇంత క్లీన్‌గా ఉన్న వ్యవహారం మళ్లీ మురికి కుంటగా మారాల్నా..? ఇవాళ కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దు. కాంగ్రెసోడు వస్తే.. మళ్లీ దోచుకుతినే రాజ్యమే వస్తది. ఇది పెద్ద ప్రమాదం.. జాగ్రత్తగా ఉండాలి.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలని చెప్పి.. అనేక పథకాలను ప్రవేశపెట్టి పేదలకు పంచుతున్నాం. ఇవన్నీ ఉండాల్నా.? పదేండ్లు పడిన శ్రమ వృథా కావాల్నా..? అద్భుతంగా అభివృద్ధి చెందిన ఈ రాష్ట్రంలో మళ్లీ పాత కథనే రావాల్నా.. ఇవన్నీ ఆలోచించాలి. దారికి వచ్చిన రాష్ర్టాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఒక్క కేసీఆరే కొట్లాడడు.. ఈ ఎలక్షన్లలో మీరే కొట్లాడాలి. మరింత అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలి. తెలంగాను బంగారం లాగా కాపాడుకోవాలి.” అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.