మేడ్చల్, సెప్టెంబర్7(నమస్తే తెలంగాణ): అర్హులకు సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అందిస్తారంటూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి గులాబీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..వెయ్యి రోజులైనా హామీలను అమలు చేయకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్రెడ్డి, కేపీ. వివేకానంద్, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అధికారులకు వినతి పత్రాలు సమర్పించి నిరసనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడ్డగోలు హామీలతో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను మోసం చేసిందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మండిపడ్డారు.