మాట తప్పిన.. మడిమ తిప్పిన సర్కార్‌పై యువత గర్జించింది.. విఫల కాంగ్రెస్ సర్కార్‌పై కన్నెర్ర చేసింది. నిరసనలతో హోరెత్తించింది. యూత్ డిక్లరేషన్.. ఉద్యోగాల భర్తీ.. నిరుద్యోగ భృతి.. యువతులకు స్కూటీలు ఇలా.. అనేక రకాల హామీలు ఇచ్చి.. మోసం చేసిన కాంగ్రెస్‌ను నిలదీసింది. యువత పోరాటానికి బీఆర్ఎస్ జెండా అండగా నిలిచింది. విద్యార్థులు, నిరుద్యోగులు, యువతీయువకులను ఏకం చేసి..వెయ్యి రోజుల విఫల పాలనను నిరసిస్తూ.. శనివారం బీఆర్ఎస్ యువతతో కలిసి కాంగ్రెస్ సర్కార్‌ను హామీల అమలు ఎన్నడని ప్రశ్నించింది. ఈ పోరుగర్జనలో ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి , మాధవరం కృష్ణారావు, సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వివేకానంద్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, పద్మారావుగౌడ్ భాగస్వాములయ్యారు. ర్యాలీలు, వంటావార్పు, ప్లకార్డుల ప్రదర్శన, పాదయాత్ర ఇలా.. వివిధ రూపాల్లో కాంగ్రెస్ సర్కార్‌కు కనువిప్పు కలిగేలా.. యువత పోరాటానికి తోడుగా గులాబీ శ్రేణులు కదం తొక్కారు. విద్యార్థుల హక్కుల కోసం, నిరుద్యోగ యువత భవిష్యత్ కోసం, ఉద్యోగ హామీల అమలయ్యేంత వరకు బీఆర్ఎస్ పోరాటం విశ్రమించదని స్పష్టం చేశారు.

సిటీ బ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులను నిలువునా మోసం చేసింది. యూత్ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విద్యార్థి లోకానికి తీరని అన్యాయం చేసింది. నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టి యువతను నిలువునా మోసం చేశారు. యువతులకు స్కూటీలు ఇస్తామని మొండిచేయి చూపారు. వెయ్యి రోజుల పాలనలో భావి తెలంగాణ పౌరులైన యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.
స్వయానా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉండి విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేశారు’ అంటూ వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ గ్రేటర్ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కాయి. విద్యార్థి, నిరుద్యోగులను ఏకం చేసి కాంగ్రెస్ దగా సర్కారుపై జంగ్ సైరన్ మోగించారు. నిరసనలు, బైక్ ర్యాలీలు, ధర్నాలతో నగరమంతా హోరెత్తించారు. వెయ్యి రోజుల్లో యువతకు కాంగ్రెస్ సర్కారు చేసిన మోసాన్ని విద్యార్థులకు వివరించారు. కాంగ్రెస్ ఎగ్గొట్టిన హామీలను వివరిస్తూ బాకీ కార్డులను పంపిణీ చేశారు. గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ నిరసనల్లో వేలాదిగా పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి వాడవాడల ర్యాలీలు తీశారు. కాంగ్రెస్ సర్కారుకు కనువిప్పు కలిగేలా జంగ్‌సైరన్ మోగించారు.

ప్రభుత్వ మోసంపై నిరసన ర్యాలీలు
మేడ్చల్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): యువత, విద్యార్థులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ దగా ప్రభుత్వంపై విద్యార్థులు, యువతతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించిన నిరసనలు దద్దరిల్లాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో విద్యార్థులు, యువత, నిరుద్యోగుల, పేదలు, మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
కూకట్పల్లి నియోజకవర్గంలోజరిగిన నిరసనలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఎలాంట న్యాయం జరగలేదని, ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆరోపించారు. ఉప్పల్ నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత శంభీపూర్ కృష్ణ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
హోరెత్తిన బీఆర్ఎస్ నిరసనలు
గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ శ్రేణులు వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టాయి. ఉప్పల్‌లో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఈసీఐఎల్ నుంచి రాధిక చౌరస్తా వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ శ్రేణులు, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. కూకట్‌పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మూసాపేట డివిజన్లో నిరసనలు చేపట్టారు. మాజీ కార్పొరేటర్లు తూము శ్రవణ్‌కుమార్, డివిజన్ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కంటోన్మెంట్లో బీఆర్ఎస్ యువ నేత మన్నె క్రిషాంక్ సంగీత్ చౌరస్తా వద్ద పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నాకు మద్దతు తెలిపారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విద్యార్థులతో ఫోన్లో మాట్లాడి భరోసా కల్పించారు. మలక్‌పేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి తీగల అభిజిత్‌రెడ్డి ఆధ్వర్యంలో దిల్‌సుఖ్‌నగర్‌లో విద్యార్థులతో నిరసన ర్యాలీ చేపట్టారు. బీఆర్ఎస్ నేత ఆజం అలీ, చెల్లూరి రఘనందన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, నర్సింగ్, టిన్ను సింగ్, నరేష్, శశిధర్ తదితరులు పాల్గొన్నారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ఆధ్వర్యంలో సరూర్‌నగర్, కొత్తపేట చౌరస్తా నుంచి ఎన్టీఆర్నగర్ మీదుగా పాదయాత్ర చేపట్టారు. బీఆర్ఎస్ శ్రేణులు, విద్యార్థులు, నిరుద్యోగులు వందలాదిగా పాల్గొన్నారు.
సనత్‌నగర్‌లో ఎమ్మె ల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలతో రాంగోపాల్‌పేట, బేగంపేట, బన్సీలాల్‌పేట, అమీర్‌పేట, సనత్‌నగర్, పద్మారావు నగర్ డివిజన్లలో నిరసనలు చేపట్టారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, జగన్, సురేష్‌రెడ్డి, మహ్మద్ఫ్రీ, దుండిగల్ మాజీ ఛైర్మన్ సత్యనారయణ తదితరలు పాల్గొన్నారు. ముషీరాబాద్‌లో బీఆర్ఎస్ యువనేత ముఠా జయసింహ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత, ఉపాధి అవకాశాలపై నిరసన చేపట్టారు. ఎడ్ల హరిబాబు, శ్రీనివాస్‌రెడ్డి, ముఠా పద్మ తదితరులు పాల్గొన్నారు. మల్కాజిగిరిలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ఆధ్వర్యంలో తార్నాకలో భారీ ర్యాలీ నిర్వహించారు.