Secunderabad | సికింద్రాబాద్ అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ చేపట్టిన శాంతియుత ర్యాలీ ప్రారంభమైంది. మోండా మార్కెట్, బాటా, జనరల్ బజార్ మీదుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపుగా ర్యాలీ కొనసాగుతోంది. నల్ల జెండాలు, కండువాలు కప్పుకుని పెద్ద ఎత్తున ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీలో పాల్గొంటున్నారు. సికింద్రాబాద్ బచావో అంటూ నినాదాలు చేస్తున్నారు.
శాంతియుత ర్యాలీ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ప్యాట్నీ సెంటర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. అటువైపు నుంచి వెళ్లే ప్రతివాహనాన్ని ఆపి, క్షుణ్నంగా తనిఖీ చేసి పంపిస్తున్నారు. మరోవైపు ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేసి, బలవంతంగా వాహనాల్లో ఎక్కించి తరలిస్తున్నారు. ఆల్ఫా హోటల్‌లోనికి వెళ్లి మరీ అరెస్టులు చేస్తున్నారు. అలాగే లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు పవన్ కుమార్ గౌడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఎంజీ రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తుండగా అరెస్టు చేశారు.