BRS Party | బంజారాహిల్స్, ఆగస్టు 20 : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండా ఎగురవేసేలా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. బుధవారం దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతా గోపీనాథ్‌తో నందినగర్‌లోని తన నివాసంలో కేటీఆర్ సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలందరినీ సమన్వయపర్చాలని, గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నేతల పనితీరుతో పాటు బూత్‌స్థాయిలో చేపట్టిన కార్యక్రమాలను మాగంటి సునీతా గోపీనాథ్ వివరించారు. ఉప ఎన్నిక వస్తుండడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, నేతలంతా నియోజకవర్గంలో తిరుగుతూ హామీలు గుప్పిస్తున్నారని, ఏడాదిన్నర నుంచి పనులు చేయకుండా తప్పించుకు తిరుగుతున్న ప్రభుత్వ పెద్దలు కపటప్రేమ నటిస్తున్న వైనాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని సునీతా గోపీనాథ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేత రవీందర్‌రావుతో పాటు రహ్మత్‌నగర్ డివిజన్‌కు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు.