ధారూరు, మే 11 : రైతులు పండించిన ప్రతి మొక్కజొన్న గింజనూ ప్రభుత్వం కొనాలని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదన్నారు. మండలంలోని గట్టేపల్లిలో వారం రోజుల కిందట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా ఇప్పటికీ రైతుల నుంచి ఒక గింజనూ కొనలేదని, ప్రశ్నిస్తే హమాలీలు లేరని అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో ఆయన వికారాబాద్ అదనపు కలెక్టర్‌కు ఫోన్ చేసి త్వరగా మొక్కజొన్న, వడ్లను కొనాలని సూచించారు.
గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతి గ్రామంలోనూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి అన్నదాతకు మద్దతు ధర కల్పించగా..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలో మొక్కజొన్న, ధాన్యాన్ని కొనాలని రైతులు రోడ్లపైకి వచ్చి రాస్తారోకోలు చేస్తున్నా ప్రభుత్వానికి పట్టడంలేదన్నారు. అన్నదాతలు పంటను నిల్వచేసే వసతి లేక తక్కువ ధరకే మధ్యదళారులను విక్రయించి నష్టపోతున్నారని.. వారికి పంట సాగుకు అయిన అప్పులు కూడా రాలేని పరిస్థితి నెలకొన్నదన్నారు. ఆయన వెంట పార్టీ మండల నాయకులు వేణుగోపాల్ రెడ్డి, రాములు, అంజయ్య, జైపాల్‌రెడ్డి, దేవేందర్‌నాయక్, వెంకటయ్య, లక్ష్మయ్య, హాఫిజ్, మహేశ్‌కుమార్, రహ్మతుల్లాఖాన్ ఉన్నారు.