ఆధునిక వైద్యరంగం వేగంగా అభివృద్ధి చెందుతూ మనిషి జీవితాన్ని మరింత సురక్షితంగా, ఆరోగ్యవంతంగా మార్చే దిశగా ముందుకు సాగుతున్నది. ఒకప్పుడు శస్త్రచికిత్స అంటేనే భయంకరమైన ప్రక్రియగా భావించేవారు. పెద్ద కోతలు, తీవ్రమైన నొప్పి, అధిక రక్త స్రావం, కోలుకోవడానికి దీర్ఘకాలం పట్టడం లాంటి సమస్యలు రోగులను ఆందోళనకు గురిచేసేవి. ముఖ్యంగా కిడ్నీ వంటి సున్నితమైనఅవయవాలపై శస్త్రచికిత్సలు చేయడం వైద్యులకు సవాలుగా ఉండేది. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రోబోటిక్ సర్జరీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) కలయిక వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది.
ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా కిడ్నీ సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. డయాబెటిస్, హైబీపీ, అధిక ఉప్పు వినియోగం, తగినంత నీరు తాగకపోవడం వంటి కారణాలు కిడ్నీలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ (CKD) ఒక మౌన వ్యాధి. ప్రారంభ దశలో లక్షణాలు కనిపించకపోవడంతో చాలామంది దీనిని ఆలస్యంగా గుర్తిస్తున్నారు. కిడ్నీలు శరీరంలో రక్తాన్ని శుద్ధి చేయడం, వ్యర్థాలను బయటికి పంపడం, ద్రవ సమతుల్యాన్ని నియంత్రించడం వంటి కీలక పనులు చేస్తాయి. ఇవి సరిగా పనిచేయకపోతే దానిని కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. ఈ దశలో డయాలసిస్ లేదా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ తప్పనిసరి అవుతుంది.
ఓపెన్ నుంచి రోబోటిక్ వరకు ఒకప్పుడు శస్త్రచికిత్స అంటే ఓపెన్ సర్జరీలే ప్రధానంగా ఉండేవి. శరీరాన్ని పెద్దగా కోసి లోపలి అవయవాలను సరిచేయాల్సి వచ్చేది. కిడ్నీ శస్త్రచికిత్సలలో 15 నుంచి 20 సెం.మీ. వరకు కోత పెట్టాల్సి వచ్చేది. దీనివల్ల రోగికి తీవ్ర నొప్పి, అధిక రక్తస్రావం, ఇన్ఫెక్షన్ ప్రమాదం ఉండేది. శస్త్రచికిత్స తర్వాత రోగి కనీసం 10 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చేది. పూర్తిగా కోలుకోవడానికి మరో 23 వారాలు పట్టేది. ఈ విధానం ప్రాణాలను రక్షించినప్పటికీ, రోగులపై భౌతిక, మానసిక భారం ఎక్కువగా ఉండేది.
ఈ సమస్యలకు పరిష్కారంగా లాపరోస్కోపిక్ సర్జరీలు ప్రవేశించాయి. చిన్న రంధ్రాల ద్వారా కెమెరాతోపాటు ప్రత్యేక పరికరాలను ఉపయోగించి శస్త్రచికిత్స చేయడం ప్రారంభమైంది. ఇది రోగులకు కొంత ఉపశమనం కలిగించింది. ఈ విధానంలో రక్తస్రావం చాలా పరిమితం. నొప్పి కూడా తక్కువే! ఆసుపత్రిలో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే ఈ విధానంలో 2D విజన్ మాత్రమే ఉండటం, లోతైన భాగాల్లో పని చేయడం కష్టం కావడం, సూక్ష్మమైన కుట్లు వేయడం క్లిష్టంగా ఉండటం వంటి పరిమితులు కనిపించాయి.

ఈ పరిమితులను అధిగమిస్తూ రోబోటిక్ సర్జరీలు వైద్యరంగంలో కొత్త దిశను చూపించాయి. రోబోటిక్ సర్జరీలో డాక్టర్ ఒక కన్సోల్ వద్ద కూర్చుని 3D హై డెఫినిషన్ విజన్ ద్వారా లోపలి అవయవాలను అత్యంత స్పష్టంగా చూస్తూ రోబో చేతులతో నియంత్రిస్తారు. ఈ రోబో చేతులు 360 డిగ్రీలలో తిరుగుతాయి, సూక్ష్మ కదలికలను సరిగ్గా అనుసరిస్తాయి. ముఖ్యంగా చేతి వణుకు లేకుండా పనిచేయడం వల్ల శస్త్రచికిత్సలో కచ్చితత్వం గణనీయంగా పెరుగుతుంది.
రోబోటిక్ సర్జరీ విజయానికి ఆధారం ఆధునిక టెక్నాలజీ. ఇందులో 3D/4K విజువలైజేషన్, మోషన్ స్కేలింగ్, ట్రెమర్ ఫిల్టరింగ్, రియల్ టైమ్ నావిగేషన్, ఇమేజ్ గైడెడ్ సిస్టమ్స్ వంటి సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి వైద్యులకు లోపలి అవయవాలను స్పష్టంగా చూపించి, శస్త్రచికిత్సను మరింత సురక్షితంగా చేయడానికి దోహద పడుతున్నాయి.
ఇటీవలి కాలంలో రోబోటిక్ సర్జరీలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరింత అభివృద్ధి చేసింది. కృత్రిమ మేధ సాయంతో శస్త్రచికిత్సకు ముందు ప్లానింగ్ మరింత కచ్చితంగా చేయవచ్చు. సర్జరీ సమయంలో కీలక అవయవాలను గుర్తించడం, ప్రమాదకర ప్రాంతాలను ముందుగానే హెచ్చరించడం, రియల్ టైమ్ డేటా విశ్లేషణ ద్వారా వైద్యులకు నిర్ణయాలలో సహాయం చేయడం సాధ్యమవుతున్నది. కొన్ని సిస్టమ్స్‌లో AI ఆధారంగా సర్జరీ ప్రోగ్రెస్‌ను మానిటర్ చేస్తూ మెరుగైన ఫలితాలను సాధించేందుకు మార్గదర్శనం కూడా అందిస్తుంది.
కిడ్నీ సమస్యల చికిత్సలో రోబోటిక్ సర్జరీలు విప్లవాత్మక మార్పు తీసుకువచ్చాయి. కిడ్నీలో ట్యూమర్లు ఉన్నప్పుడు కణితులను మాత్రమే తొలగించి మిగిలిన కిడ్నీని కాపాడే పార్షియల్ నెఫ్రెక్టమీ వంటి సున్నితమైన శస్త్రచికిత్సలను సురక్షితంగా చేయవచ్చు. ప్రొస్టేట్ క్యాన్సర్ సర్జరీలో చిన్న నాడులను కాపాడటం వల్ల రోగుల జీవన నాణ్యతను మెరుగుపరచవచ్చు.
మూత్రాశయ క్యాన్సర్, మూత్రనాళ బ్లాక్‌లు, రీకన్స్ట్రక్టివ్ సర్జరీలు వంటి క్లిష్టమైన చికిత్సలలో కూడా రోబోటిక్ విధానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ద్వారా శస్త్రచికిత్సను వేగంగా, కచ్చితంగా పూర్తి చేయవచ్చు. ముఖ్యంగా లోతైన, సున్నితమైన భాగాల్లో పని చేయడం సులభమవుతుంది.
రోబోటిక్ సర్జరీల వల్ల రోగులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పెద్ద కోతలు లేకపోవడం వల్ల నొప్పి తక్కువగా ఉంటుంది. రక్తస్రావం తగ్గుతుంది. ఇన్ఫెక్షన్ ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఆసుపత్రిలో తక్కువ రోజులు ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా రోగులు త్వరగా కోలుకుని సాధారణ జీవితానికి తిరిగి చేరుకుంటారు.
వైద్యులకు కూడా ఈ టెక్నాలజీ ఎంతో సహాయకరంగా ఉంటుంది. మెరుగైన విజువలైజేషన్, సూక్ష్మ నియంత్రణ, క్లిష్టమైన సర్జరీలను సులభంగా చేయగలగడం వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అదనంగా, AI సాయంతో నిర్ణయాలు తీసుకోవడం మరింత సులభమవుతుంది.
మొత్తం మీద రోబోటిక్, AI సాంకేతికతలు కలిసి కిడ్నీ చికిత్సలో ఒక నూతన యుగాన్ని ప్రారంభించాయి. సురక్షితమైన, కచ్చితమైన, వేగవంతమైన చికిత్సను అందిస్తూ రోగుల జీవిత నాణ్యతను మెరుగుపరుస్తున్నాయి. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెంది వైద్యరంగంలో కీలక పాత్ర పోషించనుంది.