ఉప్పల్, ఏప్రిల్ 21 : ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేది బీఆర్ఎస్ పార్టీయేనని ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం ఉప్పల్ నియోజకవర్గం చిలుకానగర్ డివిజన్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడపగడపకు వెళ్లి ప్రచారం చేయాలని, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన విషయాలను ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఎన్నికల ఇన్చార్జి జహంగీర్‌పాషా, కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్, బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, డివిజన్ అధ్యక్షుడు పల్లె నర్సింగ్‌రావు, ప్రధాన కార్యదర్శి జగన్ పాల్గొన్నారు.
మేడ్చల్: మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి అడుగడుగునా ఆదరణ లభిస్తున్నది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. అలాగే ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, కేపీ వివేకానంద్, సుధీర్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి వారి నియోజకవర్గాల్లో ముఖ్యనాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రచార వ్యూహాలను మార్చుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు.
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ..ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇక బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతల ప్రచారం అంతంత మాత్రంగానే ఉన్నది. ఆ రెండు పార్టీల అభ్యర్థులు స్థానికేతరులు కావడంతో ఇరు పార్టీలకు చెందిన శ్రేణులు కొంత నిరుత్సాహంగా ఉన్నారు. దీనికితోడు మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుపొందిన నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సరైన క్యాడర్ లేకుండాపోయింది.