మణికొండ, ఫిబ్రవరి 7: బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని.. అన్ని చోట్లా గులాబీ జెండా ఎగురవేస్తామని రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి పట్లోళ్ల కార్తిక్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడాది కాంగ్రెస్ పాలనలో ఆ పార్టీ ప్రజా ఆగ్రహానికి గురయిందన్నారు. బీఆర్ఎస్లో గెలుపొంది కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ముమ్మాటికీ బై ఎలక్షన్లు వస్తాయన్నారు.
అన్ని చోట్లా బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తంచేశారు. అవుటర్ రింగ్‌రోడ్డు లోపలి మున్సిపాలిటీలు,కాలనీలు, గ్రామాల ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఉండాలనే సంకల్పంతో గత ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.3వేల కోట్ల నిధులతో రిజర్వుయర్లను నిర్మించేందుకు నిధులను మంజూరు చేసి ప్రాజెక్టులు పూర్తిచేస్తే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు వాటిని ప్రారంభించి తామే చేశామనడం సిగ్గుచేటని కార్తిక్‌రెడ్డి అన్నారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గానికి రావాల్సిన మెట్రో ప్రాజెక్టు తరలిపోయిందని, మెట్రో వచ్చి ఉంటే నియోజకవర్గ రూపురేఖలు మారిపోయేవని కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే పార్టీ మారిన ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ నియోజకవర్గ ప్రజలు సమాధానం చెప్పాలన్నారు. అధికార పార్టీలోకి వెళ్లి తర్వాత రూపాయి తెచ్చిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్దిపై తామే చేశామని చెప్పుకోవడం దిగజారుడు తనమేనన్నారు. ఏం ప్రయోజనాల కోసం పార్టీ మారారో ఇప్పటికీ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ నియోజకవర్గ ప్రజలకు చెప్పలేదని కార్తిక్‌రెడ్డి అన్నారు.