సిటీబ్యూరో/ఎల్బీనగర్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచి ప్రయాణికులపై భారం మోపిందని విమర్శించారు. అందులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పెరిగిన బస్సు చార్జీలకు వ్యతిరేకంగా మంగళవారం ఉదయం గాంధీ భవన్ బస్టాప్ నుంచి అసెంబ్లీ వరకు బస్సులో ప్రయాణించారు. టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించారు. ప్రయాణికులతో పెరిగిన ధరలపై ముచ్చటించారు. రూ.5 నుంచి 10 వరకు చార్జీలు పెంచడాన్ని ఖండించారు.
ఈ సందర్భంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ప్రయాణం కల్పించి ఇప్పుడు సామాన్యులపై చార్జీలు పెంచి భారం వేసిందన్నారు. నగరంలో మొదటి మూడు స్టేజీలకు రూ. 5, ఆ తర్వాత రూ. 10 ధరలు పెంచిందన్నారు. ఇప్పటికే విద్యార్థుల బస్సు పాసు ధరలు, టీ -24 టిక్కెట్టు ధరలు పెంచిందని గుర్తు చేశారు. ఒకేసారి రూ.10 పెంచడం ద్వారా నగరంలోని పేద, మధ్య తరగతి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారని అన్నారు. అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయాలు దుర్మార్గమైనవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి అల్లాడుతున్న నేపథ్యంలో ప్రయాణికుడు ఒక్కొక్కరిపై నెలకు రూ. 500 భారం మోపితే బడుగు జీవులు ఎలా బతకాలో ముఖ్యమంత్రే చెప్పాలన్నారు.
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ రాజధాని వాసుల నడ్డి విరిచి ప్రతినిత్యం ప్రజలపై భారం మోపాలని చూసున్న ముఖ్యమంత్రి తీరు చూస్తే నగర ప్రజలపై కక్ష పెంచుకున్నట్లు అర్థమవుతోందన్నారు. ఫ్రీ బస్సు పథకంలో దివాలా తీసిన ఆర్టీసీని గట్టెక్కించాల్సింది పోయి సామాన్య ప్రయాణికులపై అదనపు చార్జీల భారం మోపడం క్షమించరానిదన్నారు. ఉచిత బస్సు తీసుకొచ్చి ఇప్పుడు నష్టాల్లో ఉన్నామని బస్సు చార్జీలు పె ంచితే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కేవలం ఎన్నికల్లో గెలవడం కోసమే ఉచిత బస్సు అని ఆశ చూపి ఇప్పుడు ఆర్టీసీని తీవ్రనష్టాల్లోకి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అనంతరం పెరిగిన టికెట్ ధరలు తగ్గించాలంటూ రేవంత్ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ పాలన డౌన్ డౌన్ అంటూ నినాదాలు మార్మోగాయి.