MLA Sudheer Reddy | వనస్థలిపురం, మే 17 : బీఎన్ రెడ్డి నగర్ డివిజన్లోని శివారు కాలనీల డ్రైనేజీ సమస్య పరిష్కారానికి నిర్మిస్తున్న ట్రంక్ లైన్ నిర్మాణానికి రైతులు సహకరించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కోరారు. అక్కడ జరుగుతున్న పనులను ఇటీవల రైతులు అడ్డుకోవడంతో ఆయన శనివారం రైతులను పిలిపించి తన కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు.
కాగా బృందావన్ మెడోస్ కాలనీ అధ్యక్షుడు శశికాంత్ తమ లేఅవుట్పై దురుద్దేశంతో అధికారులకు ఫిర్యాదు చేస్తూ తమను ఇబ్బంది పెడుతున్నారని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే అన్ని సమస్యలను పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. వేలాది మంది ప్రజలకు అవసరమైన డ్రైనేజీ ట్రంక్ లైన్‌కు అడ్డుపడొద్దని కోరారు. రైతుల తరఫున హాజరైన కుక్కల యాదిరెడ్డి, కుక్కల చంద్రారెడ్డిలకు సమస్యను వివరించి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కాలనీ సంక్షేమ సంఘాలు ట్రంక్ లైన్ పూర్తయ్యేవరకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటిక రెడ్డి అరవింద రెడ్డి, మనోజ్ కుమార్ గౌరీశెట్టి, శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.