హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): డిజాస్టర్ మేనేజ్మెంట్ పేరిట ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న హైడ్రా విధానంతో గ్రేటర్ హైదరాబాద్ నగర అభివృద్ధి, శివారు మున్సిపాలిటీలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ డిమాండ్ చేశారు. రాజీవ్‌గాంధీ పాలన వికేంద్రీకరణతో స్థానిక సంస్థలకు అధికారాలను బదలాయిస్తే, రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సర్కారు అందుకు విరుద్ధంగా కేంద్రీకరణ విధానాలను అమలు చేసేందుకు పూనుకున్నదని నిప్పులు చెరిగారు. పోలీస్, ఎక్సైజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, బీసీ వెల్ఫేర్ తదితర శాఖలకు సంబంధించిన బడ్జెట్ పద్దులపై అసెంబ్లీలో సోమవారం జరిగిన చర్చలో బీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పాల్గొని మాట్లాడారు.
హైదరాబాద్‌లో విపత్తుల నిర్వహణ తదితర అంశాలపై గత ప్రభుత్వం రూపొందించి అమలు చేసిన ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) విధానానికి బదులుగా కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్స్ మానిటరింగ్, ప్రొటెక్షన్ (హైడ్రా) తీసుకురావడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వం అధికారాల వికేంద్రీకరణకు పూనుకోకుండా హైడ్రా పేరిట కేంద్రీకరణకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. హైడ్రాను అమలు చేస్తే జీహెచ్ఎంసీలోని 17 మున్సిపాల్టీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఇకపై ప్రతి పనికీ జీహెచ్ఎంసీకే రావాల్సి ఉంటుందని హెచ్చరించారు.
2007లో జీహెచ్ఎంసీగా ఏర్పాటు చేసినప్పుడు ఎదురైన ఇబ్బందులను గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం 2016లో మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని, ఇప్పుడిప్పుడే సమస్యలన్నీ తొలగిపోయి పాలన సజావుగా కొనసాగుతున్నదని వెల్లడించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు హైడ్రా పేరిట అధికార కేంద్రీకరణకు కుట్ర పన్నిందని తూర్పారబట్టారు. ఆస్తుల రక్షణ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసమైతే ఈవీడీఎంకే అందుకు సంబంధించిన అధికారాలను కట్టబెట్టాలని, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు అదనంగా నిధులు కేటాయించి మరింత బలోపేతం చేయాలని, అధికారులకు నిర్ణయాధికారాలను బదలాయించాలన్నారు. అలా కాకుండా హైడ్రాను తీసుకొస్తామంటే ఉద్యమించక తప్పదని హెచ్చరించారు. అదీగాక న్యాయవివాదాలు అనేకం వస్తాయని వెల్లడించారు.
ప్రభుత్వం ఏర్పడి 8నెలలు గడిచిపోయిందని, హనీమూన్ పిరియడ్ ముగిసిందని, ఇకనైనా నిద్రలేచి అభివృద్ధిపై దృష్టిపెట్టాలని ఎమ్మెల్యే చురకలంటించారు. మూసీ సుందరీకరణకు సంబంధించిన డీపీఆర్‌ను అందజేయాలని, ఎప్పటిలోగా పూర్తిచేస్తారో చెప్పాలని, మాస్టర్‌ప్లాన్‌ను వెల్లడించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం వరదల ముంపునకు పరిష్కారంలో భాగంగా ఎస్ఎన్డీపీని చేపట్టిందని, ఇప్పటికే చాలా పనులు పూర్తయ్యాయని, కొన్ని చోట్ల పనులు పెండింగ్ ఉన్నాయని, వాటిని సత్వరమే పూర్తి చేయాలని కోరారు. అదేవిధంగా ఎస్ఎన్డీపీ ఫేజ్ -2ను కూడా ప్రారంభించాలని కోరారు. ట్రాఫిక్ సమస్య నివారణకు గత ప్రభుత్వం అమలు చేసిన ఎస్ఆర్డీపీ పాలసీని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి అవసరాల రీత్యా సుంకిశాలను సత్వరమే పూర్తిచేయాలని, అందుకు అదనంగా నిధులు కేటాయించాలని సూచించారు.
లక్షలాది మందికి ఉపయోగకరమైన రాయదుర్గం-ఎయిర్పోర్ట్ మెట్రో కనెక్టివిటీని రద్దు చేయడం అవివేకమని నిప్పులు చెరిగారు. కొందరి భూముల రక్షణ కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వెంటనే ఆ ప్రాజెక్టును చేపట్టాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే వివేకానంద్ తీవ్రంగా ఖండించారు. పదేండ్లలో ఎన్నో అవార్డులను తీసుకొచ్చామని, వంతెనలను నిర్మించామని గుర్తుచేశారు. మాజీ మంత్రి కేటీఆర్ సారథ్యంలో పదేండ్ల కాలంలో ఒక్క ఐటీ రంగంలోనే దాదాపు 6 లక్షల ఉద్యోగాలను సృష్టించామని గుర్తుచేశారు. ఇకనైనా విమర్శలు మానుకొని అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవుపలికారు.