అల్లాపూర్, అక్టోబర్ 22 : బోరబండ డివిజన్ సైట్-1 లో తమ తల్లి మాగంటి సునీతకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మాగంటి అక్షర, దిశిరలకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం 50 మందికి మించకుండా కేవలం 15, 20 మంది బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఇంటింటకీ వెళ్లి ఓటు అభ్యర్థిస్తున్న ఆడకూతుళ్లని కూడా చూడకుండా పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
ఇదే ప్రాంతంలో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ వందల మందితో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ప్రచారం చేస్తుంటే వారిని ఎందుకు అడ్డుకోరంటూ ప్రశ్నించారు. ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక, అధికార కాంగ్రెస్ పార్టీ పోలీసులను అడ్డు పెట్టుకొని ఇబ్బందుల పాలుచేస్తున్నదని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు.