చర్లపల్లి, ఏప్రిల్ 16 ః చర్లపల్లి డివిజన్ పరిధిలోని పెద్ద చర్లపల్లి చౌరస్తాలో మహానీయుల విగ్రహాలను తొలగించడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారని పేర్కొంటు స్థానికులు, దళిత సంఘాల నాయకులు, పలు పార్టీలకు చెందిన నేతలు తరలివచ్చి నిరసన తెలియచేస్తు అందోళన చేపట్టారు. దీంతో చర్లపల్లి పోలీస్‌స్టేషన్ ఇనస్పెక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
పెద్ద చర్లపల్లి చౌరస్తాలో 13 న డాక్టర్ బీఆర్.అంబేద్కర్, జ్యోతిరావు పూలే,జగ్జీవన్‌రామ్ విగ్రహాలను స్థానికులు ఏర్పాటు చేసి 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా వేడుకలను నిర్వహించారు. రెండు రోజుల పాటు వేడుకలను నిర్వహించిన స్థానికులు, దళిత సంఘాల ప్రతినిధులకు 16న తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాలను తొలగించారన్న విషయం తెలుసుకున్నారు. దీంతో పెద్ద చర్లపల్లి చౌరస్తాలో పెద్ద ఎత్తున అందోళన చేపట్టడంతో విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు నేమూరి మహేశ్‌గౌడ్, సీపీఎం జిల్లా కార్యదర్శి సత్యంలతో పాటు పలు పార్టీలకు చెందిన సత్తిరెడ్డి, కడియాల జనార్థన్, కొమ్ము నర్సింగ్‌రావు, రాంచందర్‌గౌడ్, డప్పు గిరిబాబు, కొమ్ము సురేశ్, కే.విఎల్ఎన్రావు, అనిల్‌కుమార్, రమేశ్, సురేశ్‌లు అందోళన చేపట్టారు.
దీంతో పోలీసులు అందోళన చేస్తున్న నాయకులను అరెస్టు చేసి ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు సోమశేఖర్‌రెడ్డి, మహేశ్‌గౌడ్, సత్తిరెడ్డి, జనార్ధన్, గిరిబాబు, సురేశ్, కేవిఎల్ఎన్రావు, అనిల్‌కుమార్‌లు మాట్లాడుతూ విగ్రహాలను తొలగించడం సరికాదన్నారు. మహనీయుల విగ్రహాలను తొలగించిన వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. విగ్రహాలను తొలగించిన వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ చర్లపల్లి ఇనస్పెక్టర్ సుధాకర్‌కు ఫిర్యాదు చేశారు.