OU | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగంలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు ఓయూకు వచ్చిన గవర్నర్‌ను కలిసి వర్సిటీలోని సమస్యలపై వినతిపత్రం అందజేసేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకొని, అదుపులోకి తీసుకొని లాలాగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్సిటీలో ఎలాంటి ఆందోళనలు నిర్వహించకుండా అప్రజాస్వామికంగా అధికారులు జారీ చేసిన సర్క్యులర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థినుల హాస్టళ్లలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, దానిని తక్షణమే పరిష్కరించాలని కోరారు. దీనిపై అర్ధరాత్రి విద్యార్థినిలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాంపస్ లోని అన్ని హాస్టల్లో మెస్ లలో నాణ్యత లోపించిందని, నాణ్యతతో కూడిన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని అన్నారు. విద్యార్థులు క్యాంపస్‌లో తిరిగేందుకు మరిన్ని ఉచిత బస్సులను ఏర్పాటు చేయాలని కోరారు.
యూనివర్సిటీలో సరైన సంఖ్యలో బోధన సిబ్బంది లేక బోధన, పరిశోధనలు కుంటుపడుతున్నాయని వాపోయారు. తక్షణమే వర్సిటీలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని, దానికి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో విద్యార్థులు ఇన్ని సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. వర్సిటీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో బీఆర్ఎస్ నేతలు డాక్టర్ సత్య, గౌతమ్ ప్రసాద్, అస్మా ఉన్నారు.