బండ్లగూడ, ఏప్రిల్ 15 : బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా ఈ నెల 27వ తేదీన వరంగల్లో నిర్వహించనున్న బహిరంగ సభకు బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి భారీ ఎత్తున తరలిరావాలని రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి పటోళ్ల కార్తీక్ రెడ్డి సూచించారు. రావులకోళ్ల నాగరాజు అధ్యక్షతన బీఆర్ఎస్ రజోత్సవ సన్నాహక సభను బండ్లగూడలో మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి కార్తీక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉన్నారని పటోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. మంచినీళ్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే ఆయన మాత్రం అదిగో ఇదిగో అంటూ దాటవేస్తున్నారు తప్ప సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. హిమాయత్ సాగర్ నుంచి మంచి నీళ్లు అందిస్తామని కోట్ల రూపాయలు వెచ్చించి మంచినీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ కలుషిత నీరే వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్ పరిధిలో మంచినీళ్లు లేక ప్రజలు అల్లాడిపోతున్నారని అన్నారు. దీనిపై ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ స్పందించి.. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.