కంటోన్మెంట్, అక్టోబర్ 25: బీఆర్ఎస్ పార్టీతోనే సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందని, పార్టీ మ్యానిఫెస్టోకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్లు కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని మూడో వార్డు కార్ఖానా పరిధిలోని పలు బస్తీల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు అనేక పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు.
కల్యాణలక్ష్మి పథకం కింద రూ.2 లక్షలు, గ్యాస్ సిలిండర్ రూ.400కే ఇస్తామని సీఎం ప్రకటించినట్లు తెలిపారు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద ప్రతి పేద మహిళకు రూ.3 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు చెల్లిస్తామన్నారు. పేదలకు తెల్ల రేషన్ కార్డు ద్వారా దొడ్డు బియ్యానికి బదులు సన్న బియ్యం అందిస్తామని తెలిపారు. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా పథకం కల్పిస్తున్నట్లు చెప్పారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని, కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.
దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన ప్రజా మ్యానిఫెస్టోపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆసరా పెన్షన్లు ఇస్తున్నారని, ఇంకా పెంచుతానని చెప్పడం సీఎం కేసీఆర్‌కే సాధ్యమన్నారు. కేసీఆర్ బీమా ఇంటింటికీ ధీమా పథకంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. కంటోన్మెంట్లో గులాబీ హవా వీస్తోందని దివంగత ఎమ్మెల్యే సాయన్న చేసిన సేవలే తనను గెలిపిస్తాయని లాస్యనందిత తెలిపారు.
పాదయాత్రలో ముస్లిం, మైనార్టీ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేసీఆర్ సర్కారుకే సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ పాదయాత్రలో బోర్డు మాజీ సభ్యులు అనితా ప్రభాకర్, నళిని కిరణ్‌తో పాటు సీనియర్ నాయకురాలు నివేదిత, అహమ్మద్, అక్తర్, మున్ను, ఫహీమ్, నిత్యానంద్, రాజు, దర్శన్, సత్యనారాయణ, సిరిల్, మురళీ, అనిల్, పరుశరామ్, అశోక్, చిన్న, శేఖర్, సంధ్య, స్వప్న, సబితతో సహా సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువ నాయకులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.