బంజారాహిల్స్, అక్టోబర్ 15: జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. 2014 నుంచి ప్రతి ఎన్నికల సందర్భంగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నామినేషన్ వేయడానికి ముందు ఇంటినుంచి బయలుదేరిన సమయంలో పెద్ద కుమార్తె అక్షర ఎదురు రావడం, అక్కడినుంచి జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో మాగంటి సునీత గోపీనాథ్ తన భర్త మాగంటి గోపీనాథ్ చిత్రపటానికి నివాళి అర్పించిన తర్వాత పెద్ద కుమార్తె మాగంటి అక్షర ఎదురురాగా పెద్దమ్మగుడికి బయలుదేరారు.
పెద్దమ్మగుడిలో మాజీ ఎమ్మెల్యే, ఆలయ ఫౌండర్ ట్రస్టీ పీ విష్ణువర్దన్‌రెడ్డి, కుమార్తెలు.. అక్షర, దిశిర, కొడుకు వాత్సల్యనాథ్‌తో కలిసి సునీతా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విష్ణువర్దన్‌రెడ్డి స్వయంగా కారు నడిపి మాగంటి సునీత గోపీనాథ్, ఆమె కుటుంబసభ్యులను తెలంగాణ భవన్‌కు తీసుకువచ్చారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ముఖ్యనాయకులను కలిసిన సునీత తెలంగాణ తల్లి వ్రిహానికి నివాళి అర్పించారు. అనంతరం జూబ్లీహిల్స్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకుకున్న సునీత రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
కేటీఆర్, సమీనా యాస్మిన్‌తో కలిసి నామినేషన్..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ మైనార్టీ విభాగం అధ్యక్షుడు దివంగత సర్ధార్ సతీమణి సమీనా యాస్మిన్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి, కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్‌తో కలిసి సునీత గోపీనాథ్ మొదటిసెట్ నామినేషన్ దాఖలు చేశారు. మరో సెట్ నామినేషన్‌ను మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు గౌడ్, బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి, కార్పొరేటర్ దేదీప్యరావుతో కలిసి దాఖలు చేశారు.