జూబ్లీహిల్స్, నవంబర్ 5: మాగంటి అందరికీ మంచిచేశాడని.. ఆయన చేసిన మంచి తప్పకుండా తిరిగివస్తుందని దివంగత మాగంటి సతీమణి, జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులతో నవంబర్ 14న జూబ్లీహిల్స్ గడ్డపై గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం యూసుఫ్‌గూడ డివిజన్ వెంకటగిరిలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ మాజీ ఛైర్పర్సన్ తుల ఉమ, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషాలతో కలిసి పాదయాత్రగా ఇంటింటి ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున ఆదరాభిమానాలు చూపించారు. మాగంటి కుమారుడు మాగంటి వాత్సల్యనాథ్కు విజయ తిలకం దిద్ది దీవించారు. కేసీఆర్ పాలనపై ప్రశంసలు కురిపిస్తూ.. మాగంటి చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ.. విజయం నీదేనని మాగంటి సునీతా గోపీనాథ్‌ను ఆశీర్వదించారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులను వివరించే కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బండారు రాజ్‌కుమార్ పటేల్, సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ, కంటోన్మెంట్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే నివేదితసాయన్న, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సంతోష్ ముదిరాజ్, స్థానిక నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.