కంటోన్మెంట్, అక్టోబర్ 27: ‘నియోజకవర్గ ప్రజలే నా బలం.. నా బలగం.., ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించండి.. మరింత అభివృద్ధి చేస్తా..’ అని కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత అన్నారు. సకల జనుల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఒకటో వార్డులోని బోయిన్పల్లి పెద్ద తోకట్ట, కట్టెల మండి, కంసారి బజార్, చింతల్ బస్తీల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డితో కలిసి బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందిత పాదయాత్ర చేపట్టారు. వార్డులోని ఇంటింటా తిరుగుతూ బీఆర్ఎస్ మ్యానిఫెస్టో, పదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలను ఓట్లు అడిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రతీ కుటుంబం ఏదో ఒక ప్రభుత్వ పథకం కింద లబ్ధి పొందారన్నారు.
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన తమ ప్రభుత్వానికి మరోసారి ఓటు వేయాలని, కేసీఆర్‌ను మళ్లీ సీఎంను చేయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకా మ్యానిఫెస్టోలో పొందుపర్చిన అన్ని అంశాలను అమలు చేస్తుందన్నారు. మరోమారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేయాలని, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్నికల నేపథ్యంలో వచ్చే దొంగలు, బాబాలను నమ్మవద్దని సూచించారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన ప్రజా మ్యానిఫెస్టోను చూసి ప్రతిపక్షాల్లో వణుకు మొదలైందని లాస్యనందిత తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న చొరవతో వందలాది మందికి ఇళ్లు వచ్చాయని గుర్తుచేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది సీఎం కేసీఆరేనని ఆ హామీలను అన్నింటినీ నెరవేర్చడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ అంటే మాటల పార్టీ కాదని చేతల పార్టీ అని గుర్తుంచుకోవాలన్నారు.
బీఆర్ఎస్ అంటే సంక్షేమ పథకాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీజేపీల మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. కచ్చితంగా లాస్యనందితను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. పాదయాత్రలో మహిళలంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందితకు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారన్నారు. ప్రచారంలో బోర్డు మాజీ సభ్యులు అనితా ప్రభాకర్, నళిని కిరణ్, బీఆర్ఎస్ నాయకురాలు నివేదిత, రామక్రిష్ణ, శ్రీనివాస్, మీనా భాస్కర్, అసిమ్ ఖాన్, ఇర్ఫాన్, నవీన్, పద్మ, ప్రభు గుప్తా, పలువురు సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, యువ నాయకులు, బీఆర్ఎస్ అనుబంధ సంఘాల సభ్యులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్,అక్టోబర్ 27: ప్రజల కోసం పని చేసే నాయకులకు మంచి గుర్తింపు ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బెజ్జంకి రాజేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.సికింద్రాబాద్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ జరుగని అభివృద్ధి ఈ తొమ్మిది ఏళ్లలోనే డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ సమక్షంలోనే జరిగిందన్నారు.దాదాపు 12వందల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్కే దక్కుతుందన్నారు.ఈసారి కూడా సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మారావు భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు.హ్యాట్రిక్ చాన్స్ పద్మారావుకే సొంతం అన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు,డబుల్ బెడ్ రూంలు,ఇతర పథకాలు అందించిన పద్మారావుకు ప్రజల మద్దతు ఉంటుందని చెప్పారు.