కుత్బుల్లాపూర్, నవంబర్ 9: తనకు ఇష్టంలేని పెండ్లి చేశారని జీవితంపై విరక్తి చెందిన ఓ నవ వధువు ఇంటి 5వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ మహేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… ఏపీ ఈస్ట్‌గోదావరి జిల్లాకు చెందిన అరిపిరాల వంశీకృష్ణతో ఏపీ ఈస్ట్‌గోదావరి పెరవల్లి మండలం ముక్కమాల గ్రామానికి చెందిన దుర్గాశ్రీదేవి(25)కి గత నెల 16వ తేదీన వివాహం జరిగింది.
జీడిమెట్ల డివిజన్ ఎంఎన్రెడ్డినగర్లో విక్కి రెసిడెన్షియల్ ఫ్లాట్ 203లో వంశీకృష్ణ తల్లిదండ్రులు, భార్యతో కలిసి ఉంటున్నాడు. పెండ్లి నాటి నుంచి తనకు ఇష్టంలేని వివాహం చేశారని పలుమార్లు శ్రీదేవి తన తల్లిదండ్రులతో గొడవ పడుతుండేది. దీపావళి పండుగ రోజున శ్రీదేవి తల్లిదండ్రులు కూతురు ఇంటికి వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకపోవడంతో తాను ప్రేమించిన వ్యక్తిని మరిచిపోలేక విరక్తి చెంది శుక్రవారం రాత్రి భర్త ఇంట్లో లేని సమయంలో తాను ఉంటున్న అపార్ట్మెంట్ 5వ అంతస్తు పైనుంచి కింద దూకింది. దీంతో తీవ్రగాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన సమీపంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ రాత్రి 9 గంటల సమయంలో మృతి చెందింది. మృతురాలి తల్లి రామలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.