మేడ్చల్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): ఎలివెటేడ్ కారిడార్ నిర్మాణనికి సంబంధించి భూ సేకరణకు తాత్కాలిక బ్రెక్ పడినట్లయింది. ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ఫ్లై ఓవర్‌బ్రిడ్జి) భూ సేకరణలో తమ ఆస్తులు ఇవ్వమంటూ గ్రామ సభల బహిష్కరణతో పాటు బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించిన నేపథ్యంలో భూ సేకరణకు తాత్కాలికంగా నిలిపివేసి సాంకేతిక సమస్యలను అధిగమించే పనిలో అధికారులు నిమగ్నమైనట్లు సమాచారం.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో 12 కిలో మీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనుండగా, హైదరాబాద్ జిల్లా పరిధిలో 6 కిలోమీటర్లకు మేరకు నిర్మించనున్న విషయం తెలిసిందే. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు గ్రామ సభల నిర్వహణతో ఆస్తులు కోల్పోతున్న బాధితులు.. న్యాయస్థానాన్ని ఆశ్రయించడమే కాకుండా జరుగుతున్న గ్రామ సభలను తూంకుంట, పోతాయిపల్లి, హకీంపేటలకు చెందిన బాధితులు బహిష్కరించి నిరసనలు తెలిపారు. అయితే మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సాంకేతిక సమస్యలను అధిగమించాకే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులకు ముందుకు పోవాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది.
మరింత ఆలస్యమయ్యే అవకాశం..
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల ప్రారంభానికి మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తున్నది. భూ సేకరణకు తమ ఆస్తులు ఇవ్వమని ప్రధానంగా 9 మంది ఆస్తులు కోల్పోతున్న వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధికారులు ఈ విషయమై ప్రభుత్వానికి లేఖ రాయగా, ప్రభుత్వం న్యాయస్థానంలో భూ సేకరణపై తేల్చనున్నట్లు తెలిసింది. ఇదంతా తేలడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో భూ సేకరణకు అవార్డు జారీ చేసేందుకు మరింత ఆలస్యం జరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని శామీర్‌పేట రింగ్ రోడ్డు నుంచి లోతుకుంట వరకు లక్ష 12 వేల చదరపు అడుగుల భూమి, 385 నిర్మాణాలను భూ సేకరణ ప్రక్రియలో గుర్తించి మార్క్ అవుట్ చేసిన విషయం తెలిసిందే. అయితే సాంకేతిక సమస్యలను అధిగమించే వరకు గ్రామ సభలను నిర్వహించవద్దని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 2వందల ఫీట్ల స్థలం భూ సేకరణ గుర్తింపు ప్రక్రియ చేయగా, వంద ఫీట్ల స్థలం ఎలివేటెడ్ కారిడార్‌కు సరిపోతుందని ఆస్తులు కోల్పోతున్న వారు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. వంద ఫీట్ల స్థలం మాత్రమే భూ సేకరణ చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.