సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ) : మానవ శరీరంలో అతి కీలక పాత్ర పోషించేది మెదడు. ప్రస్తుత కాలంలో తీవ్రమైన ఒత్తిడి కారణంగా అనేక రకాల మెదడు సంబధిత సమస్యలు తలెత్తుతున్నాయి. మానవ మెదడుపై పడే ఒత్తిడిని తగ్గించడంలో భాగంగా అవగాహన కార్యక్రమాలు కల్పించేందుకు ఏటా జూలై 22న అంతర్జాతీయ మెదడు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు 50ఏళ్లు దాటిన వారు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యేవారు. కానీ ప్రస్తుతం కాలంలో 20 ఏళ్లనుంచే ఈ తరహా సమస్యతో బాధపడుతున్నారు. కుటుంబానికి అండగా నిలువాల్సిన వయసులో యువత పక్షవాతానికి గురికావడంతో ఆ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాయి. ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండా, మెదడుకు ఆక్సిజన్, పోషకాలను తీసుకెళ్లే రక్తనాళాలకు అవరోధం కలగడం లేదా చిట్లడం వల్ల మెదడులోని కొంత భాగం మరణానికి దారితీసి స్ట్రోక్‌కు గురవుతారు.
యువత ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్ కు గురికావడానికి ప్రధాన కారణం ధూమపానం, మద్యపానం, జీవన విధానంలో మార్పు, రక్తపోటు, ఊబకాయం, గుండె జబ్బులు, ఈస్ట్రోజన్ కలిగిన హార్మోన్ థెరపీలు, గర్భనిరోధక మాత్రలు వాడిన మహిళల్లో సైతం స్ట్రోక్‌కు గురయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కొంతమంది జన్యుపరమైన కారణాల చేత కూడా రక్తం గడ్డకట్టడంతో పక్షవాతానికి గురవుతుంటారు. పక్షవాతాలు రెండు రకాలు కాగా.. వాటిలో రక్తనాళాల్లో అడ్డంకుల కారణంగా ఏర్పడేది ఇస్కీమిన్ స్ట్రోక్, రక్తనాళాలు చిట్లడం మూలంగా వ్యాపించేంది హెమరేజిక్ స్ట్రోక్. ఇందులో ప్రధానంగా మూతి ఒకవైపుకు వంకరగా పోవడం, చూపు కోల్పోవడం, తీవ్రమైన తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఎలాంటి స్ట్రోక్ వచ్చిందో తెలుసుకోవడం తప్పనిసరి. దానికోసం ఎంఆర్ఐ, సిటీస్కాన్ చేయించుకోవాలి. రక్తనాళాల్లో అడ్డంకుల వలన వచ్చే స్ట్రోక్‌లో థ్రాంబో లైటిక్ థెరఫీ, మెకానికల్ థ్రాంబెక్టమీ వంటివి ఉంటాయి. ఇలాంటి ట్రీట్మెంట్ వల్ల తొందరగా సాధారణ స్థితికి చేరే అవకాశం ఉంది.