వెంగళరావునగర్, జూన్ 6: కాబోయే పెండ్లి కుమారుడిపై కోటి ఆశలు పెట్టుకుంటారు యువతులు. సంపన్న కుటుంబాల్లోని అందమైన యువతులకు ప్రేమ పేరుతో గాలం వేస్తాడతను. పోలీస్ డిపార్ట్మెంట్లో తాను ఎస్ఐ ట్రైనింగ్‌లో ఉన్నానని నమ్మిస్తాడు. యువతులతో తన కామ కోరికల్ని తీర్చుకుంటాడు. ఎస్ఐ పోస్టింగ్ వచ్చేటప్పుడు డబ్బు కట్టాల్సి ఉందని చెప్పి యువతుల కుటుంబాల నుంచి రూ.లక్షల్లో వసూలు చేశాడు ఆ వంచకుడు. ప్రియుడి ఫోన్ చూడగా.. అతని కాంటాక్ట్స్ లిస్ట్‌లోని చాలా మంది అమ్మాయిల్ని ఇలా మోసం చేశాడని తెలుసుకుని నివ్వెరపోయిందా యువతి. ప్రియుడి చేతుల్లో మోసపోయిన ఆ యువతి ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం..ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన ఓ యువతి(35)కి ఐదేళ్ల కిందట మహబూబ్‌నగర్‌కు చెందిన శివ పరిచయమయ్యాడు. పోలీసు పరీక్షలు రాశానని.. ట్రైనీ ఎస్ఐగా శిక్షణ పొందుతున్నానని ఆ యువతిని నమ్మించాడు.
ప్రేమిస్తున్నానని..ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చి పెండ్లి చేసుకుంటానని యువతికి ఆశలు రేపాడు. మాయమాటలతో ఆమెను లోబర్చుకున్నాడు. పెండ్లి చేసుకుంటానని యువతి ఇంటికొచ్చి కుటుంబ సభ్యులకు మాటిచ్చాడు. ఎస్ఐ ట్రైనింగ్ అయ్యాక రూ.30లక్షలు కట్నం తేవాలని మా అమ్మ సంబంధాలు చూస్తుందని అబద్దాలు చెప్పాడు. ప్రేమించిన మీ అమ్మాయినే పెండ్లి చేసుకుంటా.. కట్నం రూ.15 లక్షలు ఇస్తే చాలని చెప్పాడు. ఎస్ఐ పోస్టింగ్ కోసం లంచం రూ.10 లక్షలు అవసరమని వసూలు చేశాడు. కొన్నాళ్లకు మరో రూ.6లక్షలు పోస్టింగ్‌కు లంచం ఇవ్వాల్సి ఉందని చెప్పి.. మొత్తం రూ.16లక్షలు వసూలు చేశాడు. ఉద్యోగం ఎక్కడ రాకుండా పోతుందోనన్న భయంతో యువతి బంగారు చైన్, మూడు జతల చెవిదిద్దులు, సోదరి వజ్రపు ఉంగరాన్ని సైతం ప్రియుడికి ముట్టజెప్పింది.
శ్రావణ మాసంలో ముహుర్తాలు పెట్టుకుందామని ప్రియురాలు కోరగా.. ఎస్ఐ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాక పెండ్లి చేసుకుంటానని వాయిదాలు వేస్తూ వచ్చాడు. పెళ్లెప్పుడు చేసుకుంటావని యువతి కుటుంబ సభ్యులు అతడ్ని నిలదీయడంతో బైక్‌పై ప్రియురాలిని కూర్చోబెట్టుకుని రూమ్‌కు తీసుకెళ్లాడు. శారీరకంగా ప్రియురాలిని కలిశాడు. ఆకలిగా ఉందని యువతి చెప్పడంతో బిర్యాని తెస్తానని ఫోన్ మర్చిపోయి బయటకు వెళ్లాడు.
ఆ సందర్భంలో ప్రియుడి ఫోన్ కాంటాక్ట్స్ చూడగా..యువతుల నంబర్లతో ఫోన్ నిండిపోయి ఉన్నది. వివాహం చేసుకుంటానని మోసం చేసి డబ్బు తీసుకున్నాడని శివ మాజీ ప్రియురాలు బాధిత యువతికి చెప్పింది. శివకు పళ్లునప్పటికీ కాలేదని అబద్ధాలు చెబుతూ అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడ్తున్నాడని తెలుకున్నది. తాను మోసపోయానని గ్రహించిన ఆ యువతి ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గతంలో శివపై జూబ్లీహిల్స్,కల్లూరు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పెండ్లి చేసుకుంటానని చెప్పే వంచకుల చేతుల్లో జీవితాలు నాశనం చేసుకోవొద్దని యువతులకు పోలీసులు సూచించారు. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.