Boyalapalli Rekha : ‘బేటీ బచావో బేటీ పఢావో నినాదానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు బోయలపల్లి రేఖ (Boyalapalli Rekha) ధ్వజమెత్తారు. నేరస్తులకు రక్షణ.. బాధితులకు శిక్ష అన్నట్టుగా వ్యవహరిస్తున్న మోడీ సర్కార్ను ఆమె దుయ్యబట్టారు. ఇటీవల దేశ రాజధానిలో చోటుచేసుకున్న సంఘటనను ప్రస్తావిస్తూ రేఖ బీజేపీ వైఖరిని ఎండగట్టారు. ఒక అత్యాచార బాధితురాలు, ఆమె వృద్ధ తల్లి తమకు జరిగిన అన్యాయంపై మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించినందుకు దాడులకు గురయ్యారు. వృద్ధురాలిని బస్సు నుంచి దింపేయడం అమానుషం. బీజేపీ పాలనలో మహిళల భద్రతపై ఉన్న దృక్పథానికి ఇలాంటి ఘటనలు ప్రతిబింబం అని రేఖ తెలిపారు.
ఎనిమిదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచారం (Unnao Case) కేసులో ప్రధాన నిందితుడైన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సేనగర్ (Kuldeep Sengar) విషయంలో చూపిన సానుభూతి, బాధితులపై మీరు ఎందుకు చూపించడం లేదు? ఈ ద్వంద్వ వైఖరి ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని బీజేపీపై మండిపడ్డారు రేఖ. “నేరస్తులకు సడలింపులు ఎందుకు?, “బాధితుల గొంతును ఎందుకు నొక్కేస్తున్నారు?, మీరు గొప్పగా చెబుతున్న “బేటీ బచావో” నినాదం ఇదేనా? . ఈ అన్యాయంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పష్టంగా స్పందించారు. బాధితులకు న్యాయం జరగాలని, మహిళల గౌరవం కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళల హక్కుల కోసం మహిళా కాంగ్రెస్ అలుపెరగని పోరాటం చేస్తోంది. న్యాయం ఆలస్యం అయితే అది న్యాయ నిరాకరణే.
ఇకనైనా బాధితుల గొంతును నొక్కేయడం ఆగాలి. నేరస్తులకు మీరు కల్పిస్తున్న రాజకీయ రక్షణకు తక్షణమే ముగింపు పలకాలి. మీ పార్టీ అనుసరిస్తున్న రెండు నాల్కల ధోరణిని యావత్ భారతదేశం చూస్తోంది. మహిళలు గమనిస్తున్నారు. బాధిత అమ్మాయిలు, మహిళలకు న్యాయం జరిగేంత వరకు మేము వెనక్కి తగ్గం’ అని కమలం పార్టీకి బోయలపల్లి రేఖ తేల్చి చెప్పారు.