కుభీర్, డిసెంబర్ 24: నిర్మల్ జిల్లా కుభీర్ మండల సర్పంచుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు కార్యవర్గాన్ని సమిష్టి ఆమోదంతో ఎన్నుకున్నారని సంఘం సలహాదారు సోనారి సర్పంచ్ ఎన్. నర్సింహా తెలిపారు. గురువారం కుభీర్‌లో జరిగిన సర్పంచుల సమావేశంలో కుభీర్ గ్రామ సర్పంచ్ కందూరి సాయినాథ్ అధ్యక్షులుగా, ఫకీర్ నాయక్ తండా సర్పంచ్ క్రాంతి రాజ్ ఉపాధ్యక్షులుగా ఎంపికయ్యారు.
సర్పంచ్ల సంఘం కార్యవర్గానికి ప్రధాన కార్యదర్శిగా చాత సర్పంచ్ జాజుల దేవేందర్, కోశాధికారిగా చొండి గ్రామ సర్పంచ్ క్రాంతి తాయిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నర్సింహా వెల్లడించారు. ఈ సమావేశంలో కందూరి సాయినాథ్ మాట్లాడుతూ.. సర్పంచుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు శాయశక్తుల కృషి చేస్తానని అన్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ అన్ని గ్రామాల అభివృద్ధికి పాటు పడతానని ఆయన పేర్కొన్నారు.
మండలంలోని 42 మంది సర్పంచులకు గాను 22 మంది సర్పంచులు హాజరయ్యారని సాయినాథ్ తెలిపారు. అనంతరం.. మార్కెట్ కమిటీ చైర్మన్ గోనే కళ్యాణ్, మాజీ జెడ్పిటిసి శంకర్ చౌహన్, పలువురు మండల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సత్కరించారు. నిన్న బీజేపీ సర్పంచులు, నేడు కాంగ్రెస్ సర్పంచులు పోటాపోటీగా సర్పంచ్ల మండల సంఘాలను ఏర్పాటు చేసుకోవడంతో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైంది.