న్యూ ఇంద్రనగర్‌లో విషాదఛాయలు
చాంద్రాయణగుట్ట,నవంబర్ 24: మానసిక స్థితి బాగోలేని ఓ వ్యక్తి సొంత అన్నపై బండరాయితో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గురువారం ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్ట న్యూ ఇంద్రనగర్‌లో నివసించే గుమ్మడి చంద్రశేఖర్, గుమ్మడి ఆంజనేయులు, గుమ్మడి సురేశ్ కుమార్ ముగ్గురు సోదరులు. వీరిలో చంద్రశేఖర్ ఇటీవల తన కుటుంబంతో సహా పాతబస్తీ నుంచి వెళ్లిపోయి.. బడంగ్‌పేటలో ఉంటున్నాడు. ప్రస్తుతం ఇంద్రనగర్ ఇంట్లో ఆంజనేయులు, సురేశ్ కుమార్ ఉంటున్నారు. సురేశ్ కుమార్‌కు పెండ్లి కాలేదు. పెండ్లి చేయాలని అన్నలపై ఒత్తిడి తెస్తున్నాడు. అయితే, సురేశ్ కుమార్‌కు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఎవరూ పిల్లను ఇవ్వడానికి ముందుకు రావడంలేదు.
ఇదిలా ఉండగా.. బుధవారం వేడి నీళ్ల కోసం ఆంజనేయులు భార్య కట్టెల పొయ్యిని వెలిగించింది. దీంతో ఆ మంట నుంచి పొగ కూడా వచ్చింది. పొగ రావడంతో వదినతో సురేశ్ గొడవకు దిగాడు. వీరిద్దరి మధ్య మాటా మాట పెరగడంతో చుట్టుపక్కల వారు వచ్చి శాంతింపజేశారు. ఇదే విషయంపై ఆంజనేయులు (45) గురువారం ఉదయం సురేశ్‌కుమార్‌ను మందలించాడు. వదినతో ఎందుకు గొడవ పడ్డావంటూ ప్రశ్నించాడు.
దీంతో ఆవేశానికి లోనైన సురేశ్ కుమార్ బండరాయితో అన్న ఆంజనేయులు తలపై మోది హత్య చేసి పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఫలక్‌నుమా ఏసీపీ షేక్ జహంగీర్, ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ సంఘటనా స్థలానికి వచ్చి.. హత్యకు గల కారణాలను స్థానికులు, మృతుడి భార్య నుంచి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా వైద్యశాలకు తరలించారు. కొడుకు పుట్టిన రోజే ఆంజనేయులు హత్యకు గురి కావడంతో బస్తీలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసును చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.