వెంగళరావునగర్, డిసెంబర్ 27: బాలికను ప్రేమిస్తున్న ప్రియుడిపై ఓ ప్రేమోన్మాది కత్తితో దాడికి పాల్పడ్డాడు. తన ప్రేమను నిరాకరించిన బాలిక మరో యువకుడిని ప్రేమిస్తుండటంతో అతడిపై కక్షగట్టిన ఆ ఉన్మాది దాడికి తెగబడ్డాడు. బాలిక ప్రేమించే ప్రియుడి గొంతుపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని అమీర్పేట్ వెస్ట్ శ్రీనివాసకాలనీలో గురువారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. వెస్ట్ శ్రీనివాసకాలనీలోని కమ్యూనిటీహాల్ సమీపంలోని ఓ లేడీస్ హాస్టల్లో బాలిక(16) తన అక్కతో కలిసి వంటపని చేస్తున్నది.
ఈ హాస్టల్కు సమీపంలోని బాయ్స్ హాస్టల్లో బాలిక బంధువులు పని చేస్తుండటంతో.. వారిని పలుకరించేందుకు బాలిక తరచూ వచ్చిపోతుండేది. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాకు చెందిన డిగ్రీ విద్యార్థి సాయిప్రవీణ్(19) ఆ బాలికకు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. అయితే బాలిక పనిచేసే హాస్టల్లోనే ఒడిశాకు చెందిన నసీరుద్దీన్ఖాన్(27) వంట పని చేస్తుండేవాడు. తనను ప్రేమించాలని నసీరుద్దీన్ఖాన్ బాలికను వేధించేవాడు.
నసీరుద్దీన్ఖాన్ ప్రేమను ఆ బాలిక నిరాకరించింది. తన ప్రేమను కాదని.. సాయిప్రవీణ్ను బాలిక ప్రేమిస్తుండటంతో అతను కోపంతో రగిలిపోయేవాడు. సాయిప్రవీణ్ను ఫోన్లో తరచూ బెదిరింపులకు గురిచేసేవాడు. నసీరుద్దీన్ఖాన్ గురువారం రాత్రి 11 గంటల సమయంలో మాట్లాడేందుకు రమ్మంటూ సాయిప్రవీణ్ను వెంగళరావునగర్కు హాస్టల్ వద్దకు పిలిపించాడు. పధకం ప్రకారం వెంట తెచ్చుకున్న కత్తితో సాయిప్రవీణ్ గొంతుపై దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న మధురానగర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన సాయిప్రవీణ్ను దవాఖానకు తరలించారు. నిందితుడు నసీరుద్దీన్ఖాన్కు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.