సిటీబ్యూరో/చార్మినార్ /నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జూలై 8 (నమస్తే తెలంగాణ): నగరంలోని పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. రాజ్‌భవన్, పాతబస్తీలోని సిటీ సివిల్‌కోర్టు, జింఖానా క్లబ్, సికింద్రాబాద్ సివిల్ కోర్టుల్లో బాంబు పెట్టినట్లుగా అబీదా అబ్దుల్లా పేరుతో మెయిల్ వచ్చింది.
బెదిరింపు మెయిల్ పంపిన ఆగంతకుడు నాలుగు ఆర్డీఎక్స్ బాంబులు, ఐఈడీలు పెట్టినట్లు మెయిల్ చేశాడు. సిటీ సివిల్ కోర్టుతో పాటు నాలుగు చోట్ల బాంబులు పెట్టినట్లు హెచ్చరికలు జారీ చేశారు. కోర్టులో పేలుడు జరిగిన తర్వాత 23 నిమిషాల్లో జింఖానా క్లబ్ పేలిపోతుందని హెచ్చరించాడు. అప్రమత్తమైన పోలీసులు బాంబ్‌స్కాడ్, డాగ్ స్కాడ్‌తో తనిఖీలు చేపట్టారు.
పాతబస్తీలోని సిటీసివిల్ కోర్టులో కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేశారు. చీఫ్మెజిస్ట్రేట్ కోర్టు మూసివేసి తనిఖీలకు అనుమతిచ్చారు. మూడుగంటలపాటు తనిఖీలు చేపట్టిన పోలీసులు ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేల్చడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అన్నా వర్సిటీ పూర్వ విద్యార్థుల పేరుతో మంగళవారం తెల్లవారుజామున 3.43 గంటలకు ఆగంతకుడు మెయిల్ పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ మెయిల్ వెనుక ఉన్నదెవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫేక్ మెయిల్‌గా అధికారులు గుర్తించారు.
సిటీ సివిల్ కోర్టుల ప్రధాన న్యాయమూర్తి శశిధర్‌రెడ్డి మొబైల్‌కు మంగళవారం బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. పోలీసులకు సమాచారం అందించడంతో బాంబ్స్కాడ్తోపాటు డాగ్‌స్కాడ్ రంగంలోకి దిగింది. కోర్టులో అణువణువును క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. సుమారు 3గంటలకుపైగా కోర్టు అంతా జల్లెడపట్టారు. ఎలాంటి బాంబ్లేదని నిర్ధారించడంతో అందరూ తేరుకున్నారు. అనంతరం న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది, కక్షిదారులను కోర్టులోకి అనుమతిచ్చారు.