మేడ్చల్, ఏప్రిల్ 3(నమస్తే తెలంగాణ): మేడ్చల్ కలెక్టరేట్ కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం సృష్టించింది. జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని బాంబుతో పేల్చివేస్తామని జిల్లా కలెక్టర్ గౌతమ్‌కు ఆగంతకుడు మెయిల్ పెట్టాడు. దీంతో మెయిల్ చూసిన కలెక్టర్ గౌతమ్ అప్రమత్తమై జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి, డీఆర్వో హరిప్రియతో కలిసి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.
అనంతరం బాంబు బెదిరింపు మెయిల్‌పై పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కలెక్టర్ గౌతమ్‌కు వచ్చిన మెయిల్‌ను పరిశీలించిన పోలీసులు విచారణ ప్రారంభించారు. కరీంనగర్‌కు చెందిన మావోయిస్టు లక్ష్మణరావు పేరిట మెయిల్ వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. మెయిల్ చేసింది లక్షణ్‌రావు లేక అతని పేరు మీద ఎవరైనా చేశారా అనేది తేలాల్సి ఉంది.
మరోవైపు బాంబు బెదిరింపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని బాంబు స్వాడ్‌తో పాటు పోలీసు జగిలాలతో ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించారు. బాంబు బెదిరింపు తప్పుడు సమాచారం అని జిల్లా కలెక్టర్ గౌతమ్‌కు పోలీసులు తెలిపారు. బాంబు బెదిరింపుపై తదుపరి విచారణ చేయాలని, బాంబు బెదిరింపు ఎందుకు చేయాల్సి వచ్చిందో పూర్తి వివరాలను తెలుసుకోవాలని కలెక్టర్ గౌతమ్ పోలీసులకు ఆదేశించారు.