సిటీబ్యూరో, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ విభాగంలో పారదర్శకమైన సేవలందించడంలో భాగంగా అందుబాటులోకి తెచ్చిన బాడీవార్న్ కెమెరాలు మూలన పడ్డాయి. నేడు ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వీటి వినియోగాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. మరోపక్క ట్రాఫిక్‌లో పనిచేస్తున్న ఠాణాల స్థాయిలోని అధికారులు ఫీల్డ్‌లోకి వెళ్లడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
హోంగార్డుల చేతికి ట్యాబ్‌లు ఇచ్చి చలాన్లు కొట్టండంటూ ఆదేశిస్తూ.. హాయిగా కొందరు అధికారులు కారు ఏసీలో నుంచి కాలు కింద పెట్టకుండా ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడితే స్థానికంగా ఉండే ఏఎస్సై, కానిస్టేబుల్, హోంగార్డులే చూసుకుంటున్నారు. కొందరు సీనియర్ అధికారులు మాత్రం మనమెందుకు పోవాలే.. అన్నట్టు కారులో నుంచి దిగడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వీఐపీ మూమెంట్స్ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే రోడ్లపై ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు కనిపిస్తున్నారు.
ఇటీవల జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులకు, ఒక వాహనదారుకు మధ్య గొడవ జరిగింది. వాహనదారుడు పోలీసులతో వాగ్వాదానికి దిగి, తన వాహనాన్ని కిందపడేశాడు. ఇలాంటి ఘటనల సమయంలో పోలీసులు సంయమనం పాటిస్తూ.. ఆవేదనతో ఉండే వాహనదారుడి సమస్యను వినేవాళ్లు కొందరు ఉంటారు. మరికొందరు అవతలి వారికంటే ఎక్కువగా రెచ్చిపోతుంటారు. ఈ సందర్భంలోనే పోలీసులు చేయి చేసుకోవడం వంటి ఘటనలు కూడా జరుగుతుంటాయి.
ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేలా బాడీవార్న్ కెమెరాలను క్షేత్ర స్థాయిలో ఉండే ట్రాఫిక్ పోలీసులు ధరించాలని కొనుగోలు చేశారు. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 200 పైగానే కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాల కొనుగోలు వ్యవహారంలోనూ కొందరు అధికారులు కక్కుర్తిపడ్డట్టు ఆరోపణలు ఉన్నాయి. కోట్ల రూపాయలు వెచ్చించి ఈ కెమెరాలను కొన్న పోలీసులు నేడు వాటిని వాడటం లేదు. అయితే, ఈ కెమెరాలు వాడకపోవడంపై భిన్న వాదనాలు వినిపిస్తున్నాయి. కెమెరాలు పనిచేస్తున్నాయా.? మొత్తానికి పాడయ్యాయా.? పనిచేస్తున్నా.. ఆ కెమెరాలను ఎందుకు వాడాలి.. అనే భావనతో మూలన పడేశారా.? అనే అంశాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఎస్సైలు, ఇన్స్పెక్టర్లు ట్యాబ్‌లు పట్టే పరిస్థితి లేదు. అలా అని క్షేత్ర స్థాయిలో ఎస్సైలు పనిచేసినా, ఇన్స్పెక్టర్లు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. వారి చేతిలో ఉండే ట్యాబ్‌లు హోంగార్డులు, కానిస్టేబుళ్ల చేతికి ఇవ్వడంతో.. రోజువారీ లక్ష్యంగా 40 నుంచి 50 చలాన్లు కొట్టడం పనిగా పెట్టుకున్నారు. హోంగార్డులు, కానిస్టేబుళ్లతో చలాన్లు కొట్టిస్తుండటంతో ఆయా కూడళ్లలో ట్రాఫిక్ క్రబద్ధీకరించే ట్రాఫిక్ సిబ్బంది తక్కువ ఉండటం, కొన్ని చోట్ల అసలు ఉండటంలేదు.
కనీసం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు ట్రాఫిక్ రద్దీ ఏర్పడే కూడళ్లలో కొద్దిసేపు ఉన్నా.. ట్రాఫిక్ ఇబ్బందులు కొంతైనా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, పోలీస్ ఉన్నతాధికారులు రోజూ రాకపోకలు సాగించే మార్గల్లో మాత్రం ఇన్స్పెక్టర్లు కనిపిస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. మిగతా రూట్లలో చాలా వరకు ఇన్స్పెక్టర్లు రోడ్డుపైకి రావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.