SSC | బోడుప్పల్, ఫిబ్రవరి 23 : బోడుప్పల్ ప్రభుత్వ పాఠశాల 2001-2002 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము ఆదివారం పాఠశాల ఆవరణలో ఘనంగా జరిగింది. పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ తమ అనుభవాలను ఒకరినొకరు పంచుకున్నారు.
రెండు దశాబ్దాల అనంతరం ఒకే వేదికపై కలిసిన పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయుల రాకతో ఆనందంలో మునిగిపోయారు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయు విద్యార్థుల ఉన్నతిని, స్థితిగతులు, వారు నిర్వహిస్తున్న రంగాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నతనంలో విద్యార్థులు చేసిన చిలిపి చేష్టలను గుర్తు చేసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు.
విద్యార్థి దశలో ఉపాధ్యాయులు పెట్టే పాఠాలను పెడచెవిన పెట్టినందున జీవితంలో అనేక గుణపాఠాలు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు తెలిపారు. ఉపాధ్యాయులు నేర్పిన క్రమశిక్షణ, ఇచ్చిన స్ఫూర్తితో సమాజంలో గౌరవంగా బతుకుతున్నామని విద్యార్థులు అన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల కలయికతో పాఠశాల ఆవణలో పండగ వాతావరణం నెలకొంది.
బోడుప్పల్ 2001-2002 SSC బ్యాచ్ రానున్న విద్యార్థులకు ఆదర్శంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. తమ బ్యాచ్లో ఉన్న పూర్వ విద్యార్థులకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఒకరికొకరం సంఘటితంగా పరిష్కరించుకుంటామని తీర్మానించుకున్నారు. అంతేకాకుండా SSC బ్యాచ్ పాఠశాల విద్యార్థులకు, నిరుపేద విద్యార్థులకు తమకు తోచిన విధంగా సహాయం చేసి విద్యాబోధనకు తోడ్పాటు అందిస్తామని వారు తెలిపారు. నేటి ఆత్మీయ సమ్మేళనం మరుపురాని రోజుగా భావిస్తున్నామని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు కిష్టయ్య, సుందరం, శేఖర్ రెడ్డి, శ్రీనివాస్, ప్రతిభారాణి, శైలజ, రత్న, పూర్వ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.