కరోనా మరణాలను తగ్గించడంలో బ్లడ్ థిన్నర్స్ ఔషధాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. వైరస్ చికిత్సకు సంబంధించి ఇప్పటివరకు ప్రత్యక్ష మందులేవి అందుబాటులో లేనప్పటికీ.. కేవలం సపోర్టింగ్ ట్రీట్‌మెంట్‌తోనే కొవిడ్‌ను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే బ్లడ్ థిన్నర్స్ కరోనా మరణాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిమ్స్ పల్మనాలజీ విభాగాధిపతి డాక్టర్ పరంజ్యోతి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ‘లాన్సెట్ ఈ క్లినికల్ జర్నల్’ కూడా ప్రచురించింది.
అమెరికాలోని మిన్నెసోటా యూనివర్సిటీ, స్విట్జర్లాండ్‌లోని బాసెల్ యూనివర్సిటీ పరిశోధకులు 60దవాఖానల్లో 6195మంది రోగులపై మూడు నెలలపాటు పరిశోధనలు జరిపి యాంటి కోయాగ్యులేషన్ థెరపితో వివరాలను సేకరించినట్లు డాక్టర్ పరంజ్యోతి తెలిపారు. రక్తాన్ని పలుచన చేసే మందులతోనే కొవిడ్ మరణాలు తగ్గినట్లు గుర్తించారని చెప్పారు. బ్లడ్ థిన్నర్స్ వినియోగించినవారిలో 43శాతం మంది దవాఖానకు రాకుండానే కొవిడ్‌ను జయించారని, ఈ ఔషధం వల్ల వైరస్ ప్రభావం తీవ్రస్థాయికి చేరే అవకాశాలు కూడా తగ్గుతాయని తెలిపారు.
కరోనా వైరస్ ఊపిరితిత్తులపైననే ప్రభావం చూపుతుందని మొదట్లో అందరూ భావించారు. కాని ఇది రక్తనాళాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తొలి, రెండవ దశలో స్పష్టమైంది. గుండెకు సంబంధించిన రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టడంతో గుండెపోటు, మెదడుకు సంబంధించిన రక్తనాళాలలో రక్తం గడ్డకట్టడంతో బ్రెయిన్ స్ట్రోక్, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడంతో శ్వాస వ్యవస్థ దెబ్బతిని రోగులు మృతి చెందుతున్నారు. రక్తం గడ్డకట్టకుండా పలుచగా మార్చేందుకు బ్లడ్ థిన్నర్స్ ఎంతో ఉపయోగపడుతున్నట్లు పేర్కొన్నారు.
కరోనా రోగుల చికిత్సలో బ్లడ్ థిన్నర్ ఔషధాలు కీలకం. కొవిడ్ మొదటి దశలోనే వైరస్ రక్తనాళాలపై ప్రభావం చూపుతుందనే విషయాన్ని గమనించాం. అప్పటి నుంచే రోగులకు బ్లడ్ థిన్నర్ ఔషధాలను ఇవ్వడం ప్రారంభించాం. రెండవ దశలో వైరస్ తీవ్రరూపం దాల్చింది. మరణాల రేటు పెరిగింది. అయితే వైరస్ లక్షణాలు మధ్యస్థ, తీవ్ర స్థాయిలో ఉన్నవారికి బ్లడ్ థిన్నర్స్ తప్పనిసరి చేశాం. ఈ ఔషధాలతో చాలా మంది ప్రాణాలను కాపాడగలిగాం.
సాధారణంగా బ్లడ్ థిన్నర్స్ ఎక్కువగా, ఎవరు పడితే వారు వాడకూడదు. వైద్యుల సూచనల మేరకే వాడాల్సి ఉంటుంది. స్వల్ప లక్షణాలున్న కరోనా రోగులకు బ్లడ్ థిన్నర్స్ అవసరం లేదు. మధ్యస్థ, తీవ్ర లక్షణాలున్న వారికి మాత్రమే ఇవ్వాలి. తీవ్రస్థాయి లక్షణాలున్నవారు కనీసం 3నెలలపాటు వాడాల్సి ఉంటుంది. – డాక్టర్ పరంజ్యోతి, పల్మనాలజీ విభాగాధిపతి, నిమ్స్ దవాఖాన