Oyo Rooms | శంషాబాద్ రూరల్, ఆగస్టు 28: ఓయో రూంలోకి వచ్చిన జంటలను లక్ష్యంగా చేసుకున్న ఓ హోటల్ యజమాని.. ఆ గదుల్లో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసి, వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ బాలరాజు కథనం ప్రకారం.. శంషాబాద్ పట్టణంలోని హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఓ భవనాన్ని ఒంగోలుకు చెందిన గణేశ్ అద్దెకు తీసుకొని.. సీతా గ్రాండ్ పేరుతో హోటల్ నిర్వహిస్తున్నాడు.
గట్టుచప్పుడు కాకుండా గదుల్లోని స్విచ్ బోర్డుల్లో సీక్రెట్ కెమెరాలను ఏర్పాటు చేశాడు. హోటల్‌కు వస్తున్న యువతీ యువకులను లక్ష్యంగా పెట్టుకొని.. సీక్రెట్ కెమెరాల ద్వారా వారు సన్నిహితంగా ఉన్న వీడియోలను రికార్డు చేస్తున్నాడు. ఆ తర్వాత యువతీ యువకులకు ఫోన్‌చేసి మీ వీడియోలు ఉన్నాయి.. నేను అడిగినంత డబ్బులు ఇవ్వండి.. లేకుంటే సోషల్ మీడియాలో పెడుతానంటు భయపెడుతున్నట్లు ఓ జంట ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
దీంతో శంషాబాద్ పట్టణంలోని సీతా హోటల్‌ను సీజ్ చేసి, యజమాని గణేశ్‌ను అరెస్టు చేశారు. అతడి వద్ద ఉన్న రెండు సెల్ఫోన్లతో పాటు యువతీ యువకులకు సంబంధించిన వీడియోలను కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
శంషాబాద్ పట్టణంలో వందల సంఖ్యలో హోటల్స్ (లాడ్జీలు) వెలుస్తున్నాయి. వాటిపై నిఘా లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎయిర్ పోర్టుకు సమీపంలో ఉండటంతో అద్దె గదులు భారీగా వెలిశాయి. గంటల వారీగా.. రోజుల వారీగా అద్దెకు గదులు తీసుకొని అసాంఘిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా శంషాబాద్ పట్టణంలోని హోటల్స్,(లాడ్జీలు)పై నిఘా పెట్టాలని కోరుతున్నారు.