కవాడిగూడ, మే 15: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ, ఆల్ ఇండియా రెజ్లర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌సింగ్‌ను వెంటనే అరెస్ట్ చేసి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని మహిళా, యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం మహిళా, యువజన సంఘాల ఆధ్వర్యంలో లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులు చేతబూని పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి.సంధ్య, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ జ్యోతి, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు డి.
స్వరూప, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి జ్యోతి పాల్గొని మాట్లాడారు. అంతర్జాతీయ క్రీడల్లో తలపడి వివిధ పతకాలను సాధించి దేశానికి కీర్తి తెచ్చిన రెజ్లర్లపై లైంగిక వేధింపులకు బీజేపీ ఎంపీ పాల్పడితే నెల రోజుల నుంచి మహిళా క్రీడాకారులు ఆందోళన చేస్తున్నా… కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. 40కి పైగా కేసులు ఉన్న ఎంపీని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్, పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ ప్రదీప్, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేందర్, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి, ఆశాలత, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ప్రతినిధి కళావతి, జావేద్, కృష్ణ, లక్ష్మీబాయి, సరళ, నాగమ్మ, ఉమా తదితరులు పాల్గొన్నారు.