కొండాపూర్, సెప్టెంబర్ 30 : రణగొణ ధ్వనులకు కాస్త దూరంగా.. ప్రకృతికి దగ్గరగా వెళితే వినసొంపైన పక్షుల కిలకిలరావాలు మదిని మీటి పరవశింపజేస్తాయి. రోజువారీ అలసట నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలా ప్రకృతికి చేరువయ్యే బర్డ్‌వాక్ కార్యక్రమాన్ని హైదరాబాద్ బర్డింగ్ పాల్స్తో కలిసి తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కొండాపూర్‌లోని బొటానికల్ గార్డెన్స్‌లో శనివారం ప్రారంభించింది. ఈ సందర్భంగా.. ఓ చిటారు కొమ్మన కనువిందు చేసిన పక్షులు.
తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ, హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ ఆధ్వర్యంలో శనివారం కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్స్‌లో పక్షుల వీక్షణ (బర్డ్ వాక్) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఎస్ఎఫ్డీసీ డైరెక్టర్ అక్బర్, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జీ స్కైలాబ్లు ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి పక్షుల వీక్షణను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 30 మంది పక్షుల వీక్షకులు, 44 మంది సరోజిని నాయుడు వనితా మహావిద్యాలయం జంతు శాస్త్రం విద్యార్థినులు విచ్చేశారు. వీరిని ఎకో టూరిజం ప్రాజెక్ట్స్ మేనేజర్ సుమన్ 4 బృందాలుగా వేరు చేసి పక్షుల వీక్షణ ఎలా చేయాలి, వాటిని ఎలా గుర్తించాలి, ఎలాంటి పక్షులు ఎలాంటి శబ్ధాలు చేస్తాయనే విషయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎఫ్డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్ నాయక్, ప్లాంటేషన్ మేనేజర్ లక్ష్మారెడ్డి, శాంసన్ రాజ్, సిబ్బంది పాల్గొన్నారు.