సిటీ బ్యూరో, జనవరి 15 (నమస్తే తెలంగాణ): వండుకుని తినగా మిగిలిన ఆహార వ్యర్థాలనే గ్యాస్‌గా మార్చి వంట చేస్తున్నారు. ఆహార వ్యర్థాలతో బయోగ్యాస్ ఉత్పత్తి చేసి ఏకంగా 400 మందికి సరిపడా ఆహారాన్ని వండుతున్నారు. ఎల్పీజీ గ్యాస్, వంట చెరకుకు అయ్యే దాదాపు రూ. 50 వేల ఖర్చును ఆదా చేస్తున్నారు. ఈ వినూత్న పద్ధతిని ఉస్మానియా యూనివర్సిటీలోని మహిళల హాస్టల్లో వినియోగిస్తున్నారు. మహిళల మెస్‌లో వంట చేయడానికి ఆరు నెలలుగా ఆహార వ్యర్థాలతో తయారు చేసిన బయోగ్యాస్‌నే వాడుతున్నారు.
ఖర్చుతో పాటు యూనివర్సిటీ పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్నారు. ఈ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పునాది పడింది. యూనివర్సిటీలోని అప్పటి అధికారులు ప్రతిపాదనలు చేసి, పనులు పూర్తి చేసి 2024 డిసెంబర్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ బయోగ్యాస్ ప్లాంట్ వందలాది మంది విద్యార్థులకు పర్యావరణహితమైన ఆహారాన్ని వండి వడ్డించేందుకు దోహదపడుతున్నది.
ప్లాంట్ ద్వారా 300 నుంచి 400 మందికి వంట
బయోగ్యాస్ ప్లాంట్ నుంచి వచ్చే గ్యాస్‌ను వినియోగించేందుకు వంట గదుల్లో ప్రత్యేకమైన బయోగ్యాస్ స్టవ్‌లను ఏర్పాటు చేశారు. ప్లాంట్ నుంచి నేరుగా స్టవ్‌కి గ్యాస్ సరఫరా అవుతుంది. దీని ద్వారా నిత్యం 300 మంది నుంచి 400 మంది విద్యార్థులకు సరిపడా ఆహారాన్ని వండుతున్నట్లు ఉమెన్స్ హాస్టల్ డైరెక్టర్ కల్యాణలక్ష్మి తెలిపారు. ఈ బయో గ్యాస్ ద్వారా ఎల్పీజీ, వంట చెరకుకు అయ్యే రూ. 40 వేల నుంచి రూ.50 వేలను ఆదా చేస్తున్నామని వెల్లడించారు. హాస్టల్లోని ఒక కిచెన్‌లో నెలకు 19 గ్యాస్ సిలిండర్లు వాడేవారు. అదేవిధంగా 13.34 టన్నుల వంట చెరకును వినియోగించేవారు. ప్రస్తుతం పూర్తిగా ఈ ప్లాంట్ నుంచి వచ్చిన బయోగ్యాస్‌నే వాడుతున్నారు. ప్లాంట్ వినియోగంలోకి వచ్చిన ఆరు నెలల నుంచి క్యాంపస్ వాతావారణం పూర్తిగా మారిపోయిందని ఆమె చెప్పారు.
గత అక్టోబర్ వరకు ఆహార వ్యర్థాల తొలగింపు ఒక సవాలుగా ఉండేదన్నారు. కొన్ని చోట్ల వ్యర్థాల వల్ల దుర్వాసన వెదజల్లేదని చెప్పారు. తీసుకెళ్లేవారు పూర్తిస్థాయిలో తొలగించకపోవడం వల్ల ఆ పరిస్థితి ఏర్పడేదని, ఇప్పుడు ఎలాంటి దుర్వాసన లేకుండా క్యాంపస్ ఆహ్లాదంగా ఉందన్నారు. ఇప్పుడు ఆహార వ్యర్థాల వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ బయోగ్యాస్ ప్లాంట్లను అన్ని యూనివర్సిటీల హాస్టళ్లలో ఏర్పాటు చేస్తే ఎల్పీజీ, వంట చెరకు వినియోగాన్ని తగ్గించి పర్యావరణానికి మేలు చేయవచ్చని చెప్పారు. మెన్స్ హాస్టల్లో కూడా ఇలాంటి బయో గ్యాస్‌ను ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
బయోగ్యాస్ తయారీ ఇలా..
యూనివర్సిటీలోని ఉమెన్స్ హాస్టల్ పరిసరాల్లో ఆహార వ్యర్థాల బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా రోజూ రెండు టన్నుల తడి ఆహార వ్యర్థాను ప్రాసెస్ చేస్తున్నారు. ముందుగా యూనివర్సిటీల్లోని అన్ని మెస్‌ల నుంచి ఆహార వ్యర్థాలను ఎలక్ట్రిక్ వాహనం ద్వారా డబ్బాల్లో సేకరిస్తారు. వాటిని ప్లాంట్ వద్దకు తీసుకొచ్చి తూకం వేసి సార్టింగ్ టేబుల్‌కు చేరుస్తారు. అక్కడ ఆహార వ్యర్థాలను క్రషర్లో వేసి చూర్ణం చేస్తారు. ఆ చూర్ణాన్ని స్లర్రీతో కలిపి డైజెస్టర్ ట్యాంకుకు పంపిస్తారు.
డైజెస్టర్ ట్యాంక్‌లోకి చేరుకున్న వ్యర్థాల చూర్ణం పూర్తిగా డైజెషన్ అవుతుంది. ఇందులోంచి బయోగ్యాస్ ఏర్పడుతుందని ప్లాంట్ ఆపరేటర్ చెబుతున్నారు. ఇది ట్రాప్ స్క్రబ్బర్ ద్వారా హైడ్రోజన్ సల్ఫైడ్‌తో పాటు తేమను గ్రహిస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్‌లో 60 శాతం మిథేన్ మిశ్రమం శుద్ధి అవుతుంది. శుద్ధి చేసిన మిథేన్‌ను బయోగ్యాస్ నిల్వచేసే బెలూన్లకు పంపిస్తారు. అక్కడి నుంచి పైప్ సిస్టం ద్వారా హాస్టల్ వంటగదికి సరఫరా చేస్తారు. దీని వినియోగం వల్ల నెలకు 85 టన్నుల కార్బన్ ఉద్గారాలు వెలువడకుండా నిరోధిస్తున్నారు.