GHMC | ఎల్బీనగర్, ఆగస్టు 2: ‘నన్ను విధులు నిర్వహించకుండా అధికారులు అడ్డుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ఆదాయానికి గండికొడుతున్నారు. అవినీతికి అడ్డుపడితే నీ పని కాదని సహోద్యోగులే బెదిరింపులకు దిగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పనిచేయలేను. స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు అవకాశమివ్వండి’. ఇదీ జీహెచ్ఎంసీలోని ఓ బిల్ కలెక్టర్ ఆవేదన. పన్ను వసూలు విషయంలో ఉన్నతాధికారులు అక్రమాలకు పాల్పుతున్నారంటూ జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ఆర్జీపెట్టుకోవడం ఇప్పుడు చర్చకు దారితీసింది. జీహెచ్ఎంసీలో అవినీతి జోరుగా సాగుతున్నదని వరుసగా కథనాలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఉద్యోగి వ్యక్తపర్చిన ఆవేదన హృదయవిదారకంగా మారింది.
జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోన్‌లోని సరూర్‌నగర్ సర్కిల్ బిల్ కలెక్టర్ శ్రీశైలంయాదవ్.. అధికారులపై అవినీతి ఆరోపణలు చేస్తూ రోడ్డెక్కడం… బల్దియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం 321 డాకెట్‌లో విధులు నిర్వహిస్తున్న తనను ఉన్నతాధికారులు పని చేసుకోవనివ్వడంలేదంటూ జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ఆశ్రయించారు. బల్దియాకు రావాల్సిన ఆదాయానికి అధికారులే గండి కొడుతున్నారని చెప్పారు. హాస్టళ్లు, విద్యాసంస్థలు, ప్రైవేటు కార్యాలయాలకు కూడా నివాసాలుగా చూపుతూ పన్నులు వసూలు చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి వాటిని కమర్షియల్ భవనాలుగా పరిగణలోకి తీసుకుని… పన్నులు వసూలు చేసేలా మార్పులు చేసినట్టు వివరించారు.
జీహెచ్ఎంసీ ఖజానాకు గండిగొట్టే తప్పులను తప్పని నిలదీస్తే వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దారుణాలకు పాల్పడుతున్న అవినీతి అధికారులతో కలిసి పని చేయడం ఇష్టంలేదని తేల్చిచెప్పారు. స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం కల్పించాలని కోరారు. వాణిజ్య భవనాలకు సంబంధించిన పన్నుల విషయంలో తనిఖీలకు వెళ్లకూడదని తనను బెదిరిస్తున్నారని తెలిపారు. ఉపకమిషనర్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, టీఐపై అవినీతి ఆరోపణలు చేస్తూ లేఖలో గోడు వెళ్లబోసుకున్నాడు.
నిజాయతీగా పనిచేస్తున్న తనను వరుసగా బదిలీలు చేస్తూ వేధిస్తున్నారని శ్రీశైలంయాదవ్ కమిషనర్‌కు రాసిన లేఖలో ఆవేదన వ్యక్తంచేశారు. అక్రమాలను గుర్తించి.. నోటీసులు ఇస్తుంటే.. ఉపకమిషనర్, ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ఏఎంసీలకు నచ్చడంలేదని, ప్రాపర్టీ చెక్ చేయకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘అవినీతిని అడ్డుకోవడం నీ పనికాదు.
నువ్వు ఆఫ్టరాల్ బిల్ కలెక్టర్, నాకు జవాబు ఇస్తావా?’ అంటూ బెదిరించడంతో పాటుగా డాకెట్లు మారుస్తూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వరుసగా బదిలీలు, ఉద్యోగంలో వేధింపులతో బీపీ పెరిగి, రెండు రోజుల క్రితం కళ్లు తిరిగిపడిపోయానని జీహెచ్ఎంసీ కమిషనర్‌కు పెట్టుకున్న ఆర్జీలో పేర్కొన్నారు. కనీసం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకుంటే ప్రశాంతంగా ఆరోగ్యంగంగా జీవించే అవకాశం లభిస్తుందని తెలిపారు. అధికారులు తనను వేధించిన విషయంలో అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.