బంజారాహిల్స్, జూలై 15: మూడు నెలల క్రితం చోరీ అయిన బైక్ ట్రాఫిక్ పోలీసులు విధించిన చలానా వల్ల దొరికింది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు చౌరస్తాలో బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తున్నారు. అదే సమయంలో ముగ్గురు యువకులు హోండా యాక్టివాపై నంబర్ ప్లేట్ లేకుండా వచ్చారు. హెల్మెట్ కూడా ధరించకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు వారిని ఆపారు. బైక్ నడిపిస్తున్న వ్యక్తి మైనర్ అని తేలింది.
నంబర్ ప్లేట్ లేకపోవడంతో చాసిస్ నంబర్ ఆధారంగా టీఎస్ 09 ఈ జెడ్ 1525 అనే రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన బైక్ అని గుర్తించారు. దీంతో ఈ నంబర్ మీద మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చలానా విధించారు. బైక్ నంబర్‌తోపాటు బైక్ ఫొటోను టాబ్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేశారు. ఆన్లైన్లో బండినంబర్ నమోదైన వెంటనే యజమానికి మెసేజ్ వెళ్లింది. నిమిషాల వ్యవధిలోనే వాహన యజమాని లియాండర్ టెర్రెన్స్ స్మిత్ అనే వ్యక్తి బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చాడు. తాను బంజారాహిల్స్‌లో ఓ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నానని, కాసేపటి క్రితం ట్రాఫిక్ పోలీసులు చలానా విధించిన బండి తనదేనని, ఏప్రిల్ 2న తన బైక్ చోరీకి గురికాగా అదే రోజు అమీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు.
దీంతో అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు ఈ విషయాన్ని బంజారాహిల్స్ రోడ్ నంబర్-14లో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డికి తెలిపారు. అప్పటికీ యాక్టివా మీద వచ్చిన ముగ్గురు అక్కడే ఉండడంతో వారి విషయాన్ని అమీర్‌పేట పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. తమ పీఎస్ పరిధిలో యాక్టివా బైక్ చోరీ అయిన మాట వాస్తవమేనని ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అక్కడ పోలీసులు తెలిపారు. దీంతో బైక్ మీద వచ్చిన ముగ్గురితో పాటు బైక్‌ను కూడా అమీర్‌పేట పోలీసులకు అప్పగించారు. మొత్తానికి ట్రాఫిక్ పోలీసులు విధించిన చలానా చోరీ బైక్‌ను పట్టించింది.