హైదరాబాద్: హైదరాబాద్‌లో బైక్ రేసర్లు (Bike Racing) రెచ్చిపోతున్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు అర్ధరాత్రి వేళ రోడ్లపై బైకు రేస్‌లు, స్టంట్లు చేస్తున్నారు. ముందు టైర్లను పైకిలేపుతూ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. బైక్ స్టాండ్ రోడ్డుకు తాకిస్తూ మంటలు పుట్టిస్తూ తోటి వాహనదారులను భయాందోళనలకు గురిచేస్తున్నారు. శనివారం అర్ధరాత్రి రాయదుర్గం నాలెడ్జ్ సిటీ టీహబ్ వద్ద రోడ్డుపై కొందరు యువకులు బైక్ రేస్ నిర్వహించారు. వాయువేగంతో దూసుకెళ్తూ, స్టంట్లతో రాయదుర్గం నుంచి వెళ్లే వాహనదారులను తీవ్ర ఇబ్బంది పెట్టారు. దీంతో స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పలువురు పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు. బైకులను సీజ్ చేశారు.
పట్టుబడ్డ యువకుల్లో మైనర్లు, విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగులు, డెలివరీ బాయ్స్ ఉన్నట్లు గుర్తించారు. కాగా, బైక్‌రేస్ స్టంట్లను రోడ్డుకు ఇరువైపులా నిలబడి స్థానికులు వీక్షించారు. కొన్ని రోజుల క్రితం రాయదుర్గం పోలీసులు 80కిపైగా బైకులు సీజ్ చేయడమే కాకుండా.. పది మంది యువకులను అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు పెట్టిన విషయం తెలిసిందే.