ఘట్కేసర్ రూరల్, డిసెంబర్ 17ః నిమిషాల్లో గంటల్లో వేలాది లైకులతో ఉన్నఫళంగా పాపులర్ అయిపోవాలనే వారు రీల్స్ కోసం చేస్తున్న విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. అటువంటి రీల్స్ చేస్తూ రోడ్డుపై నోట్లు వెదజల్లి కేసులో ఇరుక్కుపోయాడో యువకుడు. ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ పరశురాం తెలిపిన వివరాల ప్రకారం బాలానగర్‌కు చెందిన భానుచందర్(35) అనే యువకుడు ఘట్ కేసర్లోని ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 9 వద్ద ‘మనీ హాంటింగ్ చాలెంజ్’ అంటు రీల్స్ చేశాడు. ‘20 వేలు పడేస్తున్నాను. ఎవరైనా తీసుకోండి. గుడ్ లక్’ అంటు రీల్స్ చేశాడు. ఆ తర్వాత సోషల్‌మీడియాలో ఆ రీల్‌ను పోస్ట్ చేశాడు. ఔటర్ రింగురోడ్డు నిర్వహణ సిబ్బంది ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని న్యూసెన్స్ కింద ఫిర్యాదు చేశారు. కాగా అవి అసలైన నోట్లా నకిలీ నోట్లా ఇంకా నిర్ధారణ అవలేదు. ఈ మేరకు ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.